Yadadri Temple: యాద‌గిరిగుట్ట ఆలయం అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

Yadadri Temple: యాద‌గిరిగుట్ట ఆలయం అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Yadadri Temple

Updated On : January 30, 2025 / 1:55 PM IST

Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట ఆలయం ఒకటి. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఆ ఆలయాన్ని దర్శించుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. పాత ఆలయం స్థానంలో సకల హంగులతో కొత్తగా ఆలయాన్ని పున:నిర్మాణం చేశారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ సైతం ఆలయాన్ని మరింత అభివృద్ధిపర్చేందుకు దృష్టిసారించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయంలోనూ పాలకమండలి బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Also Read: GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో డిష్యూం డిష్యూం.. చర్చ లేకుండానే బడ్జెట్ కు ఆమోదం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతో సమావేశం అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోర్డు నియామకపు నిబంధనలపై సమీక్షించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతోపాటు, ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలనూ చేపట్టాలని సూచించారు.

Also Read: తెలంగాణలో టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌.. సాయంత్రం వేళల్లో ఆరు రకాలతో అదిరిపోయే స్నాక్స్..

తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోతాయని భక్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఆలయానికి వచ్చే నిధులు, కానుకల ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రత్యేక బోర్డు ఏర్పాటయితే రాబోయే కాలంలో తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయ అబివృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆలయం నిధులు, కానుకలతోనే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది నవంబర్ నెలలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఆలయ అభివృద్ధికి అధికారులకు పలు సూచనలు చేశారు.