ఇది శోచనీయము.. బాధాకరం.. తెలంగాణ ప్రజలకు అవమానకరం: రేవంత్ రెడ్డి
"మాకు అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచారులు, మా పార్టీ అధ్యక్షుడు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసింది" అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఢిల్లీలో తమకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
“దురదృష్టవశాత్తు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు.. ఇది శోచనీయము.. ఇది బాధాకరము.. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము. బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటివరకు కుట్రలు చేస్తూనే వస్తోంది” అని అన్నారు.
“తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఇండి కూటమి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన నిరసనకు పూర్తి స్థాయి మద్దతు పలికారు.
Also Read: రికీ ఈ-రిక్షా లాంచ్‌కి బజాజ్ ఆటో సిద్ధం.. ఆ కంపెనీ ప్లాన్లు అదుర్స్..
దాదాపుగా 10 రోజుల ముందు నుంచే రాష్ట్రపతిని కలిసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన రెండు బిల్లులు, కేసీఆర్ తీసుకొచ్చి గుదిబండగా మారిన 50% పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ ను ఆమోదించాలని అనుకున్నాం. ఈ మేరకు దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశాం.
ఆ తర్వాత మోదీ, అమిత్ షా రాష్ట్రపతిని కలిశారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. రాష్ట్రపతి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు.. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మాకు అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచారులు, మా పార్టీ అధ్యక్షుడు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసింది” అని రేవంత్ రెడ్డి తెలిపారు.