Assembly Session: అసెంబ్లీ సమావేశాలు షూరూ.. సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Telangana Assembly Session
Telangana Thalli Statue: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు సభలో ఐదు బిల్లులు, రెండు నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటనతోపాటు తదితర అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తరువాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు సోమవారం సభ ముగిసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు కొంత విరామం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులు ఎమ్మెల్యేలకు శిక్షణ అనంతరం తిరిగి సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై బీఏసీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6గంటల సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. లక్ష మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రచించిన కవి అందెశ్రీని, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు.
సీఎం రేవంత్ షెడ్యూల్ ఇలా..
సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:45 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. ఉదయం 10:20 గంటలకు అసెంబ్లీ చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు డ్రోన్ షోను తిలకిస్తారు.