YS Sharmila : వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్..! త్వరలో విలీనంపై అధికారిక ప్రకటన

షర్మిల వల్ల అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. YS Sharmila

YS Sharmila : వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్..! త్వరలో విలీనంపై అధికారిక ప్రకటన

YS Sharmila

YS Sharmila – Congress : వైఎస్ షర్మిల రాకను తెలంగాణ పీసీసీ వ్యతిరేకిస్తోంది. పార్టీలో షర్మిల పాత్రపై ఏపీ కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఢిల్లీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ను తీసుకునేందుకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ విలీన ప్రక్రియకు ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

టార్గెట్ కేసీఆర్ సర్కార్..
సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్ షర్మిల తన తండ్రి వైఎస్ పేరుకి తెలంగాణను జోడించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని ప్రకటించిన నాటి నుంచి షర్మిల దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు. తెలంగాణలో 3వేల 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు, ఆరోపణలు చేసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు షర్మిల. ఈ క్రమంలో ఓసారి జైలుకి సైతం వెళ్లి వచ్చారు.(YS Sharmila)

Also Read..CM KCR : ఎన్నికల వేళ కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త టెన్షన్.. ఎమ్మెల్యేలకు శాపంగా మారిన ఆ పథకం?

అనుకున్నదొకటి.. అయినదొకటి..
షర్మిల రాజకీయ పార్టీని స్థాపించాక పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆశించారు. కానీ, ఆమె ఆశించిన స్థాయిలో నేతలెవరూ రాలేదు. బీఆర్ఎస్ పార్టీని కొంతలో కొంతైనా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో జత కట్టాల్సిందేనని షర్మిల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను కలవకుండా తన కుటుంబ సన్నిహితుడు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రాయబారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో బెంగళూరు వెళ్లి మూడుసార్లు సమావేశం అయ్యారామె.

షర్మిలతో లాభం కన్నా నష్టమే ఎక్కువ:
డీకే శివకుమార్ రాయబారంతో కాంగ్రెస్ పార్టీతో చర్చల వరకు వెళ్లింది వ్యవహారం. అయితే, వైఎస్ షర్మిల రాకను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణలో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు రేవంత్. తప్పనిసరైతే షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని ఢిల్లీ పెద్దలకు సూచించారు రేవంత్.(YS Sharmila)

షర్మిల వస్తే జగన్ కే లాభం..
మరోవైపు ఏపీలోనూ షర్మిల ఎంట్రీపై కాంగ్రెస్ నేతలు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. షర్మిల వల్ల రాష్ట్రంలో వైఎస్ జగన్ కే పరోక్షంగా లాభం జరుగుతుందే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండబోదని అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వమైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు వైఎస్ షర్మిల. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమె రాజకీయ పాత్రపై స్పష్టత ఇవ్వని ఢిల్లీ పెద్దలు పార్టీ విలీనానికి మాత్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read..Chandrababu Interrogation : సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి

హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ కు షర్మిల ఓకే..!
ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన షర్మిల భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేశారు. తెలంగాణ, కర్నాటకలో అవసరం మేరకు సేవలు ఉపయోగించుకుంటామని అధిష్టానం పెద్దల మాటగా షర్మిలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత జాతీయ స్థాయిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు కర్నాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని డీకే శివకుమార్ ఢిల్లీ పెద్దల తరపున షర్మిలకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ కి ఓకే చెప్పాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో మరోసారి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి పార్టీ విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు షర్మిల.