CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలనకు ఏడాది పూర్తి.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు.

CM Revanth Reddy
Revanth Reddy Marks One Year in Power: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై నడిపిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయ్యింది. తెలంగాణలో ఎదురే లేదనుకున్న గులాబి పార్టీని ఓడించారు. తెలంగాణ సమాజంలో తిరుగులేదనుకున్న కేసీఆర్‌ను గద్దెదించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. సోనియా,రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ సీఎంగా రేవంత్ పగ్గాలు చేపట్టారు.
ఆరు గ్యారంటీలకు శ్రీకారం..
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహలక్ష్మీ పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆర్థికంగా ఎన్నికష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణంతో సగటున రోజుకు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికులకు 1500 కోట్ల లబ్ధి జరిగింది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. అరకోటి కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మరోవైపు ప్రతీ నియోజకవర్గంలో 3 వేల 500 చొప్పున ఏడాదిలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం. 7 లక్షల కోట్ల అప్పులతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల నుంచి అభివృద్ధి దిశగా పయనించేందుకు అష్టకష్టాలు పడుతోంది. గత సర్కార్ చేసిన అప్పులపై శాఖల వారీగా అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసింది.
ఒక్కోక్కటిగా హామీలను అమలు ..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది. పంద్రాగస్టు రోజున రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి నాలుగు విడతలుగా పూర్తి చేసింది. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన రైతు భరోసా 7 వేల 625 కోట్లు చెల్లించింది. మరోవైపు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 13 కోట్ల ప్రీమియంతో రేవంత్ సర్కార్ పంట బీమా చెల్లించింది. రైతు సంక్షేమంకోసం ఏడాదిలో 57వేల కోట్లు ఖర్చు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు కమీషన్‌ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్.
పెట్టుబడులపైనా ఫోకస్..
సంక్షేమం.. అభివృద్ధి అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కార్.. పెట్టుబడులపైనా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలతలు వివరించి దిగ్గజ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సాధించారు. దావోస్ పర్యటనలో 40 వేల 232 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. ఇక అమెరికా, దక్షిణకొరియా పర్యటనలో దాదాపు 31 వేల 502 కోట్ల పెట్టుబడులు సాధించారు.
హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ..
తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచం ముందు తెలంగాణ బ్రాండ్‌ను పెంచుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. విజన్ 2050 మాస్టర్ ప్లాన్‌తో హైదరాబాద్‌ను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తోంది. ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంకల్పించింది. రంగారెడ్డి జిల్లా బేగరకంచెలో ఫ్యూచర్ సిటీకి పునాది రాయి వేశారు. న్యూయార్క్‌కు దీటుగా హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం. దేశంలోనే జీరో కార్బన్ సిటీగా నిర్మాణం కానుంది. ఈ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్, ఐటీ, ఫార్మా హబ్‌కు కేంద్రంగా ఉండనుంది.
మూసీ ప్రక్షాళనకు శ్రీకారం..
హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్నమూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా సాహోసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ మూసీ పునరుజ్జీవం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మూసీకి పూర్వ వైభవం తెచ్చి సియోల్‌లో హన్, లండన్‌లో థేమ్స్ నదిలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ డెవలప్ మెంట్ కారిడార్‌గా మార్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక, బిజినెస్, హోటల్స్, మాల్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్‌తో టూరిజమ్ అడ్డాగా మార్చాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. అంతేకాదు… మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చి మూసీలో పారేలా డిజైన్ చేసింది.
హైడ్రాతో చెరువుల కబ్జాకు చెక్..
లేక్ సిటీగా గణమైన చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో ఇప్పుడు చెరువులు కనపడని పరిస్థితి. దీనికి బ్రేకులు వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి ఇప్పటివరకు సర్కార్ వెయ్యికిపైగా చెరువులను కబ్జానుంచి విడిపించింది. మరోవైపు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 360 కిలోమీటర్ల పొడుగునా ట్రిపుల్ ఆర్మ నిర్మాణం చేయనుంది. మొదటి ఫేజ్‌లో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించనున్నారు. ఇక భాగ్యనగరాన్ని ట్రాఫిక్ కష్టాలకు దూరం చేసేందుకు… ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం 6 వేల కోట్లను ఖర్చు చేయనుంది. అంతేకాదు మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్ టు కోకాపేట్, ఎంజీబీఎస్- చాంద్రాయణ గుట్ట, మియాపూర్ టు పటాన్ చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు రెండో దశలో మెట్రో రానుంది.
భారీగా ఉద్యోగాల భర్తీ..
తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే TGPSC ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తొలి ఏడాదిలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ నియమాక పత్రాలు అందించారు. తెలంగాణ ఏర్పాటుకు అత్యంత మూలమైన ఆత్మగౌరవం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేటెంట్‌ను సొంతం చేసుకునేందుకు ఒక అవకాశంగా మలుచుకున్నారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. TSను టీజీగా మార్చారు. ఉద్యమ ఆంకాంక్షలను నిజం చేస్తూ వెళ్తున్నారు. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయనున్నారు.
తనదైన మార్క్ పాలనతో..
పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ.. పాలిటిక్స్‌లో అందరి అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చక్రం తిప్పుతున్నారు. సొంత పార్టీ నేతలతోపాటు ప్రతిపక్షాలను సింగిల్ హ్యాండ్‌తో కంట్రోల్ చేస్తున్నారు. కలహాలకు కేరాఫ్‌గా ఉండే కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న సహచర మంత్రులుతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో మూడు నెలల కంటే ఎక్కువ కాలం సీఎం ఉండరనే ప్రచారాన్ని పటా పంచలు చేస్తూ జేజేలు కొట్టించుకున్నారు. ఏడాది పాలనలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో తనదైన మార్క్ పాలిటిక్స్‌ను నడుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీన పర్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. మొత్తానికి… పదిహేను ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ZPTC నుంచి ముఖ్యమంత్రి కుర్చీ వరకు ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి.. సంక్షేమం, అభివృద్ది, తెలంగాణ ఆత్మగౌరవం ఫార్ములాతో ముందుకెళ్తున్నారు.