Uttam Kumar Reddy: ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి.. సడెన్ గా మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ పిలుపు.. అసలేం జరుగుతోంది..
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.

Uttam Kumar Reddy: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా పార్టీ పెద్దలను కలుస్తుండగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తినక వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో ఆయన వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రుల శాఖల మార్పులపై ఆయనతో పాటు పార్టీ పెద్దలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.
ఈ సమయంలో ఒక్కసారిగా ఉత్తమ్ ఢిల్లీ పర్యటకు వెళ్లడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. క్యాబినెట్ లో ఉన్న కొందరు పాత మంత్రుల శాఖల పనితీరు, మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ బెర్త్ లో చోటు దక్కని ఆశావహులకు కీలక పదవులు దక్కనున్నాయి. ఖాళీ అయినవి, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపైనా పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.
అన్నీ అంశాలు కొలిక్కి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికీ కేటాయించని శాఖలు సీఎం రేవంత్ దగ్గర చాలానే ఉన్నాయి.
Also Read: కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. మాజీ సీఎంని అడగబోయే 20 ప్రశ్నలు ఇవే?
విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వైల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ కార్మిక మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖలతో పాటు మరికొన్ని శాఖలు సీఎం రేవంత్ వద్దే ఉన్నాయి. వీటిలో కొన్ని శాఖలను ముగ్గురు మంత్రులకు కేటాయించే ఛాన్స్ ఉంది. దీంతో సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాకే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత రానుంది.