పరామర్శ ఎంత పనిచేసింది : హైదరాబాద్ లో ఒక్క వ్యక్తి ద్వారా 34 మందికి కరోనా

తెలంగాణలో కరోనా వ్యాపిస్తోంది..బయటకు వెళ్లవద్దు..లాక్ డౌన్ నిబంధనలు పాటించండి..ఇంట్లోనే ఉండండి..ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని అటు ప్రభుత్వం..ఇటు అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు..డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది నగర ప్రజలు.
వీరి వల్ల ఆరోగ్యంగా ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఓ వ్యక్తి ద్వారా 34 మందికి కరోనా వైరస్ సోకిన షాకింగ్ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వృద్ధురాలిని పరమార్శించడానికి వచ్చి..కరోనా అంటించాడు.
వివరాల్లోకి వెళితే…
భవనీనగర్ తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు గుండె జబ్బుతో బాధ పడింది. ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యింది. ఈ విషయం బంధువులకు తెలిసింది. కరోనా వైరస్ వ్యాపిస్తుండడం..లాక్ డౌైన్ నిబంధనలవుతుండడంతో పరమార్శించడానికి కొంతమంది రాలేదు. కానీ..బాలాపూర్ లో నివాసం ఉంటున్న బంధువు మాత్రం వృద్దురాలి ఇంటికి వచ్చాడు. ఆమెను పరామర్శించాడు.
లాక్ డౌన్ నిబంధనలు పాటించకుడా..అందరితో సన్నిహితంగా మెలిగాడు. కొద్ది రోజుల తర్వాత వృద్దురాలు మరోసారి అనారోగ్యానికి గురైంది. గతంలో చికిత్స పొందిన ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని గుర్తించారు. వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు.
వైద్యం చేసిన సిబ్బందిని, కుటుంబసభ్యులు, స్థానికులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34 మందికి కరోనా వ్యాధి ఉన్నట్లు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరితో పాటు సన్నిహితంగా ఉన్న మరో 21 మందిని హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.
Also Read | పెరుగుతున్న కేసులు..లాక్ డౌన్ పై ఏం చేద్దాం..తెలంగాణ కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ