Harish Rao Thanneeru : రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం పెద్ద జోక్- రాహుల్ గాంధీకి మంత్రి హరీశ్ రావు కౌంటర్

Harish Rao Thanneeru : అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టింది.

Harish Rao Thanneeru : రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం పెద్ద జోక్- రాహుల్ గాంధీకి మంత్రి హరీశ్ రావు కౌంటర్

Harish Rao Thanneeru (Photo : Google)

Updated On : July 7, 2023 / 3:54 PM IST

Harish Rao Thanneeru – Rahul Gandhi తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. పేదల కలలను కేసీఆర్ నాశనం చేశారు. భూములను దోచుకోవడానికే ధరణిని తెచ్చారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు అంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తీవ్ర విమర్శలతో ఎదురుదాడికి దిగారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు హరీశ్ రావు. మీ పార్టీ పేరు స్కాంగ్రెస్ అని ధ్వజమెత్తారాయన.

ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు.. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది. అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టింది.

Also Read..Rahul Gandhi: తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నా.. ఇంకా..: రాహుల్‌ హామీలు

బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు..
మాది పేదలకు ఏ టీం
ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం
బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు
అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది

రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..?
మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది?
అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా?
స్కీమ్ ల్లోని స్కాంల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే

Also Read..Ponguleti Srinivas Reddy: అందుకే కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు: పొంగులేటి

అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు..

ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు.