గుడ్ న్యూస్.. తెలంగాణలో సెప్టెంబ‌ర్‌లో అదుపులోకి క‌రోనా!

  • Published By: sreehari ,Published On : August 8, 2020 / 06:43 PM IST
గుడ్ న్యూస్.. తెలంగాణలో సెప్టెంబ‌ర్‌లో అదుపులోకి క‌రోనా!

Updated On : August 8, 2020 / 6:56 PM IST

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. కరోనావైరస్ సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టనుంది.. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి నాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉందని, రానురాను కేసుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు.

ఆగస్టు చివరి నాటికి కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని శ్రీనివాస్ తెలిపారు. జీహెచ్ఎంసీలో ఆగస్టు చివరి నాటికి కేసులు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందని ఆయన చెప్పారు.



జిల్లా కేంద్రాల్లో కరోనా విస్తరిస్తోందని శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణలో రోజు 23వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కరోనా మరణాల రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం రూ.100 కోట్లు అందజేసిందని తెలిపారు. రెండోవారంలో కూడా కొంతమందికి ఇబ్బండి పెడుతోందని చెప్పారు.

జిల్లాల్లోని ఆస్పత్రులతో పాటు అన్ని వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంజెక్షన్లు జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉంచామన్నారు. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.



దాదాపు 18 వేల పడకలకు ఆక్సిజన్‌ అందుబాటులోకి రాబోతుందన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కరోనా రోగులు త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం ధైర్యం కల్పిస్తుందన్నారు. కరోనా నిర్ధారణ అయ్యాక చికిత్స విధానం కచ్చితంగా
పాటించాలన్నారు. కరోనా రోగుల్లో అందరికీ ఒకే రకమైన మందులు ఇవ్వడం సరికాదన్నారు.



కరోనా పాజిటివ్‌ వస్తే 14 రోజులకు మందుల కిట్‌ అందజేస్తున్నామని చెప్పారు. సరైన సమయంలో మందులు వాడితేనే కరోనా తగ్గుతుందని చెప్పారు. ఐసోలేషన్‌ సౌకర్యం లేని వారికి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.కొన్ని కరోనా తీవ్రమైన కేసుల్లో విషమంగా ఉన్న సమయంలో వెంటిలేటర్‌పై ఉన్నవారికి ప్లాస్మా ఇచ్చినా ఉపయోగం ఉండదన్నారు. ప్లాస్మా దాతల్లో యాంటీబాడీలు తప్పక అభివృద్ధి అయి ఉండాలన్నారు. అప్పుడే ప్లాస్మా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.