Telangana BJP : గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్న కారణంతో కమలం గూటికి వస్తే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని.. Telangana BJP Crisis

Telangana BJP : గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

Telangana BJP Crisis

Telangana BJP Crisis : తెలంగాణ బీజేపీ రాజకీయాలు చిత్రవిచిత్రంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు టికెట్లు, ప్రచారం అంటూ హడావిడి చేస్తుంటే.. బీజేపీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించి క్షేత్ర స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే బీజేపీలో మాత్రం ఇటువంటి సన్నద్దత ఏదీ కనిపించడం లేదు. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధిష్టానం సైలెంట్ గా ఉండగా కొందరు సీనియర్లు ముఖ్యంగా మాజీ ఎంపీలు వరుస భేటీలతో కమలంలో కాక రేపుతున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

తరుచుగా సీనియర్ల సమావేశాలు..
తెలంగాణలో కమలం పార్టీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీజేపీ సీనియర్ లీడర్లు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు తరుచూ ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తూ హీట్ పుట్టిస్తున్నారు. కొంతకాలం రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఇవి బహిర్గతం అవుతున్నా అధిష్టానం జోక్యం చేసుకోవడంతో అంతలోనే సర్దుకుంటున్నాయి. కానీ, ఈ మధ్య ప్రతి రెండు రోజులకు ఒకసారి సమావేశం అవుతూ విస్తృత చర్చకు కారణం అవుతున్నారు బీజేపీ సీనియర్లు.

Also Read..Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?

ఆ నలుగురు గోడ దూకే ఛాన్స్?
అక్టోబర్ 1న తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఉంటుంది. మహబూబ్ నగర్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లలో రాష్ట్ర పార్టీ తలమునకలై ఉండగా సీనియర్ నేతలు వేరు కుంపటి రాజకీయాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. పార్టీపై అసంతృప్తితో ఉన్న ఈ నలుగురు గోడ దూకే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17న కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనలో కూడా తమకు ప్రాధాన్యం దక్కలేదని రగిలిపోతున్న నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాములమ్మ ట్వీట్లతో కమలంలో గందరగోళం..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వీరికి ఆహ్వానాలు అందినట్లు చెబుతున్నారు. అయితే ఆ ఆహ్వానాలకు వీరు ఎలా స్పందించారో కానీ, ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా భేటీ అవుతూ పార్టీని గందరగోళంలో నెట్టేస్తున్నారు. ఇక రాములమ్మ అయితే మరో అడుగు ముందుకేసి ఎవరికి అర్థం కావాలో వారికే అర్థమయ్యేలా ట్వీట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. రాములమ్మ ట్వీట్ల పరమార్ధం అర్థం కాక కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.

పార్టీ మారతారని ప్రచారం..
వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ వీరితోవలో మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఎంపీ రవ్రీంద నాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనురు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ విజయ రమణారావు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ పేరు తాజాగా వినిపిస్తుండటం బీజేపీ కేడర్ ను షేక్ చేస్తోంది. ఎన్నికల ముంగిట ఈ పరిణామాలతో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తల పట్టుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్న కారణంతో కమలం గూటికి వస్తే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదన్న సాకుతో గోడ దూకేయాలని నేతలంతా చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read..Konda Vishweshwar Reddy : కమలంలో కలకలం.. ప్రస్తుతం బీజేపీ గెలిచే పరిస్థితి లేదంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గెలుపే లక్ష్యం..
సీనియర్లతో ఏదో ఒకటి తేల్చేయాలని రాష్ట్ర పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రధాని పర్యటనలోగా ఏదో ఒక విషయం తేల్చేస్తే పార్టీకి మంచిదనే భావన వ్యక్తమవుతోంది. అయితే సీనియర్లు మాత్రం తాము పార్టీ వీడే ప్రసక్తే లేదంటున్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా గెలిపించాలనేదే తమ లక్ష్యం అని, ఇందుకోసమే ప్రత్యేక సమాశాలు నిర్వహిస్తున్నట్లు కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఏది ఏమైనా పార్టీ కార్యాలయానికి దూరంగా ఫాంహౌస్ లో జరుగుతున్న ప్రత్యేక సమావేశాలపై కమల దళంలో చర్చ జోరుగా నడుస్తోంది. ప్రధాని రాకతో అయినా ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందో? మరింత ముదురుతుందో చూడాలి మరి.