MLC Kavitha : ఏం జరగనుంది..? కవిత ఈడీ కేసు బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

కవితకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తుంది. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, బెయిల్ ఇస్తే కవిత సాక్షులను,

MLC Kavitha : ఏం జరగనుంది..? కవిత ఈడీ కేసు బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

MLC Kavitha

Delhi Liquor Case : ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరింది. లిక్కర్ కేసులో ఈడీ చట్ట విరుద్ధంగా తనను అరెస్ట్ చేసిందని, రాజకీయ కక్ష సాధింపు ఉందని కవిత పిటీషన్ లో పేర్కొంది. ఈడీ కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నందున, మహిళగా, వైద్య పరమైన కారణాలు, బీఆర్ఎస్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నందున అన్నిఅంశాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది. ఈడీ అరెస్టు తో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనలేక పోతున్నానని పిటీషన్ లో కవిత పేర్కొంది.

Also Read : Mlc Kavitha : ఇంటి భోజనం, దుస్తులు, పరుపు.. సీబీఐ కస్టడీలో కవితకు కొన్ని వెసులుబాట్లు

కవితకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తుంది. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, బెయిల్ ఇస్తే కవిత సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తుందని ఈడీ వాదిస్తోంది. దీంతో మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు కవిత రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది. ఇదిలాఉంటే.. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఏప్రిల్ 8న కవితకు మధ్యంతర బెయిల్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తన చిన్న కుమారుడి పరీక్షల నిమిత్తం ఏప్రిల్ 16వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

Also Read : Delhi Liquor Policy Case: 23వరకు జ్యుడీషియల్ కస్టడీ.. కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 16న కవితను కోర్టులో హాజరుపర్చగా.. రెండు దఫాలుగా మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. మార్చి 26న ఆ కస్టడీ ముగియడంతో ట్రయల్ కోర్టు కవితకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, తన కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని రెగ్యూలర్ బెయిల్ ఇవ్వాలని కవిత రెండు పిటీషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపిన కోర్టు కొడుకు పరీక్షల కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని ఆ పిటీషన్ ను కొట్టివేసింది. రెగ్యులర్ బెయిల్ పై విచారణ వాయిదా వేయగా.. ఆ పిటీషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. అయితే, కవితకు బెయిల్ వస్తుందా..? కోర్టు ఏం చెబుతుంది అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది.