Delhi Liquor Policy Case: 23వరకు జ్యుడీషియల్ కస్టడీ.. కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Delhi Liquor Policy Case: 23వరకు జ్యుడీషియల్ కస్టడీ.. కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavitha

Updated On : April 15, 2024 / 11:19 AM IST

MLC Kavitha Liquor Case Updates : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఎమ్మెల్సీ కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే, న్యాయస్థానం తొమ్మిది రోజులు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అనుమతి ఇచ్చింది. ఈనెల 23వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. దీంతో మరోసారి అధికారులు కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇదిలాఉంటే..  కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్న క్రమంలో కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని, వాళ్లు కొత్తగా అడిగేందుకు ఏం లేదని కవిత తెలిపారు.

Also Read : Mlc Kavitha : ఇంటి భోజనం, దుస్తులు, పరుపు.. సీబీఐ కస్టడీలో కవితకు కొన్ని వెసులుబాట్లు

ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను గత నెల 16న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో ఇప్పటికే కవిత తీహార్ జైలుకు వెళ్లారు. సీబీఐ అధికారులు తీహార్ జైలులోనే కవితను ఈనెల 11న అరెస్టు చేశారు. మూడు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు కవితను హాజరుపర్చారు. అయితే, కవిత విచారణకు సహకరించడం లేదు.. అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారంటూ సీబీఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు పురోగతిని కోర్టుకు సీబీఐ అధికారులు వివరించారు. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని, 14రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే, రౌస్ అవెన్యూ కోర్టు తొమ్మిది రోజులు (ఈనెల 23వరకు) కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Also Read : Mlc Kavitha : కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం

ఈడీ కేసులోకూడా ఏప్రిల్ 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ ఉంది. సీబీఐ కేసులో 14రోజులు అంటే రెండుసార్లు కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈనెల 23వ తేదీ వరకు అయితే.. రెండు కేసులు ఒకేసారి విచారించవచ్చు అనేభావనలో కోర్టు సీబీఐ కేసులోనూ ఈనెల 23వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. దీంతో కవిత రెండు కేసుల్లో తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈనెల 23వరకు తీహార్ జైలులోనే కవిత ఉండనున్నారు. అయితే, మనీల్యాండరింగ్ కేసులో కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై రేపు విచారణ జరగనుంది. ఈరోజు కవితను జ్యుడీషియల్ కస్టడీకి పంపించాల్సిన అవసరం లేదని కవిత తరపున న్యాయవాదులు కోరినప్పటికీ.. కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోలేదు.

కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ ను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో రెగ్యూలర్ బెయిల్ పిటీషన్ ను కవిత దాఖలు చేశారు. ఈనెల 20న ఆ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉంది.. కానీ, ముందస్తుగా విచారణ చేపట్టాలని కోర్టును కోరడంతో రేపు పిటీషన్ పై కోర్టు విచారణ జరపనుంది. రేపైనా కవితకు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఊరట దక్కుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే. ఒకవేళ ఈడీ కేసులో ఊరట లభించినా సీబీఐ కేసులో కవిత జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.