నవంబర్ 3న పోలింగ్, 10న ఫలితాలు.. దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

dubbaka byelection schedule: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 16 నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కాగా.. అక్టోబర్ 17న నామినేషన్ల పరిశీలిస్తారు. 19న ఉపసంహరణకు అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక వచ్చింది.
ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా నోటిఫికేషన్ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు.
దుబ్బాకతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన 56 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బీహార్‌లోని వాల్మీకి ఎంపీ స్థానం ఉప ఎన్నిక జరుగనుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నిజానికి 2021 ఫిబ్రవరి వరకు గ్రేటర్ కార్యవర్గ పదవీకాలం ఉన్నా, ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తుండటంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
షెడ్యూల్ వివరాలు..
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ నవంబర్: 10
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంపై నిషేధం కొనసాగుతుండటంతో దుబ్బాకలో నేతలు జాగ్రత్తగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ టికెట్ దక్కొచ్చని తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ పేరును ఖరారు చేయకముందే రఘునందన్ రావు ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ తరఫున నలుగురైదుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
టీఆర్ఎస్ అభ్యర్థి భార్యా? కుమారుడా?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉపఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ సీట్ కావడంతో.. దుబ్బాక తమదే అనే ధీమా టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ఇప్పటికి అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. అధిష్టానం ఎవరిని నిలబెట్టినా.. గెలిపించుకునేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే.. టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తారని ప్రచారం ఉంది. కొద్దిరోజుల కిందటి వరకు సుజాతకే సీటివ్వాలని భావించారు గులాబీ బాస్ కేసీఆర్.
కలకలం రేపుతున్న రామలింగారెడ్డి కుమారుడి ఆడియోలు:
అయితే.. రామలింగారెడ్డి కుమారుడి ఆడియోలు కొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం సీటు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో… సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి సెంటిమెంట్ ప్రకారం రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారా.. లేక నెగెటివ్ క్యాంపెయిన్ నడుస్తుండటంతో.. మనసు మార్చుకుని చెరుకు ముత్యం రెడ్డి కుమారుడికి సీటు కేటాయిస్తారా అనే విషయంపై డైలమా నెలకొంది.
దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ వ్యూహాలు:
మరోవైపు… టికెట్ ఎవరికి ఇచ్చినా… దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే.. ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న ఆయన… నియోజకవర్గంలో పర్యటిస్తూ.. గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై మూడు పార్టీలు(టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ) కన్నేశాయి. ఎలాగైనా ఈ ఉపఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి.