అంతా ఆన్ లైన్ : ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 06:56 AM IST
అంతా ఆన్ లైన్ : ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం

Updated On : October 28, 2020 / 7:38 AM IST

Dharani Portal Launch : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తహసీల్దార్లకు ట్రైనింగ్ ఇస్తోంది ప్రభుత్వం. మరోవైపు… ధరణి పోర్టల్ ప్రారంభించే వేదికను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.




ఇప్పటికే ముహూర్తం ఖరారు కాగా.. ఇప్పుడు ప్రారంభించే వేదికను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ధరణి పోర్టల్‌ను రంగారెడ్డి జిల్లా వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ధరణిపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరణి పోర్టల్ నిర్వహణపై తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చింది.




ఘట్‌కేసర్‌ అనురాగ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో తహసీల్దార్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఈ ట్రైనింగ్ సెషన్‌కు హాజ‌ర‌య్యారు. వీరికి ఉదయం థియరీ క్లాసులు, సాయంత్రం ప్రాక్టికల్‌ క్లాసులు నిర్వహించారు.




కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నందున.. సెప్టెంబర్‌ 8 నుంచి తెలంగాణలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్‌ 29 నుంచి అవన్నీ మళ్లీ మొదలవుతాయి. ఇప్పటికే తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లను ట్రయల్స్ చేశారు. 20 నుంచి 40 వరకు నమూనా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌లు చేశారు. వాస్తవంగా దసరా రోజే ధరణి ప్రారంభించాల్సి ఉన్నా.. వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడింది.




ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేష‌న్లు, మ్యూటేష‌న్లు అన్నీ నిలిపేసిన ప్రభుత్వం.. ధ‌ర‌ణి పోర్టల్‌ ద్వారా చేస్తామ‌ని ప్రకటించింది. రెవెన్యూ శాఖ‌లో స‌మూల మార్పుల కోసం ధ‌ర‌ణి ప‌రిష్కారం అని చెబుతూ.. వ్యవ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్‌ను ఎమ్మార్వోల‌కు అప్పగించింది.




వర్షాల కారణంగా ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో.. ఈనెల 29వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల దగ్గరి ఇళ్లు, ఫామ్ హౌజ్‌ లాంటి వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్‌లో మ్యూటేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ విజప్తి చేశారు.