Harish Rao : 20 కార్లతో వెంబడించారు, భయబ్రాంతులకు గురి చేశారు- కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీశ్ రావు.

Harish Rao : 20 కార్లతో వెంబడించారు, భయబ్రాంతులకు గురి చేశారు- కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao : కాంగ్రెస్ నేతల తీరుపై ఎక్స్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డితో పాటు కార్పొరేటర్లని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో మేయర్, కార్పొరేటర్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు. పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్లకు డీజీపీ, రాచకొండ కమిషనర్ వెంటనే భద్రత కల్పించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీశ్ రావు.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాసం హైడ్రామా నెలకొంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ పార్టీకి తలొగ్గకపోవడంతో దాడి చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లను ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో కాంగ్రెస్ నాయకులు, సుధీర్ రెడ్డి వెంబడిస్తున్నారని.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడ ఆగితే అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వాపోయారు. ఈ ఘటనతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు భయబ్రాంతులకు గురవుతున్నారని వాపోయారు.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానంపై కొందరు కార్పొరేటర్లు కలెక్టర్ కు విన్నవించారు. వచ్చే నెల 5వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తేదీని కన్ ఫర్మ్ చేశారు. ఈ క్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు బయటకు వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు వారి కారుని వెంబడించారు. వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. 11 మంది కార్పొరేటర్లు, మేయర్ చాకచక్యంగా తప్పించుకున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారని, వారంతా తన మీద కావాలనే అవిశ్వాస తీర్మానం పెట్టారని, తనను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే వారే ఈ చర్యలకు పాల్పడినట్లు జక్కా వెంకట్ రెడ్డి ఆరోపించారు.

దీనిపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. మేయర్ ని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను భయపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికార పార్టీ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి హస్తగతం చేసుకుంది. తాజాగా పీర్జాదిగూడ కార్పొరేషన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగానే తమ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేసిందని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.

జక్కా వెంకట్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
జూన్ 6న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. నాకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో సూర్యాపేట నుంచి శంషాబాద్ కు వెళ్తుండగా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్, అతడి అనుచరులు మా కార్లను వెంబడించి భయబ్రాంతులకు గురి చేశారు. వారి నుంచి తప్పించుకుని మేడిపల్లిలోని మా నివాసానికి చేరుకున్నాం.

Also Read : ఈసారి మోసపోతే తప్పు మనదే, ఆలోచించి ఓటు వేయండి- కేటీఆర్