Telangana Ministers: జూపల్లి టు భట్టి.. మంత్రుల చుట్టూ వరుస వివాదాలు.. సీఎం ఏం చేయబోతున్నారు?

ఎక్కడో పుట్టిన వివాదం.. రకరకాల మలుపులు తిరిగి.. బొగ్గు గనుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం భట్టి చుట్టూ ఆరోపణలు వినిపించగా.. సీఎం రేవంత్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

Telangana Ministers: జూపల్లి టు భట్టి.. మంత్రుల చుట్టూ వరుస వివాదాలు.. సీఎం ఏం చేయబోతున్నారు?

Komati Reddy Venkat Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 9:07 PM IST
  • ఓ మంత్రిపై కథనం.. అందులో అరెస్ట్‌లు..
  • బొగ్గు బ్లాక్‌ల వ్యవహారం కారణమనే ఆరోపణలు
  • మంత్రుల మధ్య వివాదాలపై సీఎం రేవంత్ ఆరా..!

 

Telangana Ministers: రకరకాల ఆరోపణలు.. రకరకాల వివాదాలు.. తెలంగాణ మంత్రుల చుట్టూ కనిపిస్తున్న పరిణామాలు ఇవే.! ఇవిప్పుడు మరింత రచ్చకెక్కాయా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయం పొగలు కక్కుతోంది. మంత్రుల మధ్య విభేదాలు, వివాదాలు.. ఉన్నతాధికారులకు శాపంగా మారుతున్నాయా? మంత్రుల తీరుపై నిఘా పెట్టిన సీఎం రేవంత్‌.. పూర్తి స్థాయిలో ఆరా తీయడం స్టార్ట్‌ చేశారా? అసలేం జరుగుతోంది..

జూపల్లి నుంచి ఇప్పుడు భట్టి వరకు.. తెలంగాణలో మంత్రుల చుట్టూ వరుస వివాదాలు కనిపిస్తున్నాయ్‌. మరికొందరు మంత్రులపై వినిపిస్తున్న ఆరోపణలు.. ఇంకొందరు మంత్రుల మధ్య కనిపిస్తున్న విభేదాలు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్‌. ఈ పరిణామాలు సీఎం రేవంత్‌కు కొత్త తలపోటుగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే ఓ మంత్రిపై కథనం ప్రసారం కావడం.. అందులో అరెస్ట్‌లు జరగడం..
కొత్త మలుపు తీసుకున్న వివాదం..

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కాక పుట్టించగా.. ఇప్పుడు ఆ వివాదం కొత్త మలుపు తీసుకుంది. బొగ్గు గనుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. మంత్రుల మధ్య విభేదాలకు, లీక్‌లకు కూడా.. బొగ్గు బ్లాక్‌ల వ్యవహారమనే గుసగుసలు వినిపించడం.. కథనాలు రావడంపై ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. ఇది అటు తిరిగి.. డిప్యూటీ సీఎం భట్టి టార్గెట్ అయ్యేలా చేసింది. దీంతో ఆయన స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆ గనుల కోసం కొత్తగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

సీనియర్ ఐఏఎస్ రిజ్వి వర్సెస్‌ మంత్రి జూపల్లి

ఇప్పుడు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. గతంలో మరికొందరు మంత్రుల చుట్టూ ఇలాంటి ఆరోపణలు, వివాదాలే వినిపించాయ్‌. సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వి, ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వివాదం.. అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టించింది. రిజ్వి తన ఆదేశాలు పట్టించుకోవడం లేదని ఆరోపించిన జూపల్లి.. స్వయంగా ఓ లేఖ రాయడం అప్పట్లో కలకలం రేపింది. ఆ తర్వాత ఈ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయ్‌.

రిజ్వి వీఆర్ఎస్‌ ఆమోదించొద్దంటూ సీఎస్‌తో పాటు సీఎంకు జూపల్లి మరో లేఖ రాయడం.. విభేదాలను మరింత బహిర్గతం చేసినట్లు అయింది. ఇక అటు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. హస్తం పార్టీలో కొద్దిరోజుల కింద క్రియేట్ చేసిన తుఫాన్ అంతా ఇంతా కాదు.

సీఎం రేవంత్‌, సలహాదారు నరేందర్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు..

మాజీ ఓఎస్డీ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లినప్పుడు.. సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయ్‌. సీఎం రేవంత్‌, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి.. తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటు విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్‌ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ పరిణామాల మధ్య జరిగిన కేబినెట్ భేటీకి కూడా సురేఖ దూరంగా ఉండడం.. విభేదాలను మరింత స్ట్రాంగ్ చేసింది.

ఆ తర్వాత కొండా సురేఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి ముందు.. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్‌ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటికి.. దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ మధ్య వివాదాలతో.. జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరు మంత్రుల పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌ వరకు వెళ్లింది.

మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో పొంగులేటికి విభేదాలు

ఇక మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో.. మంత్రి పొంగులేటికి విభేదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయ్. చివరికి ఓ ప్రభుత్వ భూమి విషయంలో కోర్టులో పిటిషన్ వేసే వరకు వెళ్లింది పంచాయితీ. ఇలా ఒకదాని తర్వాత ఒకరు వివాదాలు తెరమీదకు వస్తుంటే.. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా ఆరోపణలు వినిపిస్తున్నాయ్‌. కట్ చేస్తే ఎక్కడో పుట్టిన వివాదం.. రకరకాల మలుపులు తిరిగి.. బొగ్గు గనుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం భట్టి చుట్టూ ఆరోపణలు వినిపించగా.. సీఎం రేవంత్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

వరుస వివాదాలు, ఆరోపణలు.. ప్రతిపక్షానికి ఆయుధంగా మారి.. పార్టీని ఇరుకున పెట్టేలా కనిపిస్తున్నాయ్. దీంతో సీఎం రేవంత్ వీటిపై నజర్‌ పెంచినట్లు తెలుస్తోంది. ప్రతీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు మంత్రులపై వచ్చే ఆరోపణలకు వివరణ కావాలంటే.. తనను అడగాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.

Also Read: తెలంగాణలో కవిత కోసం రంగంలోకి ప్రశాంత్ కిశోర్.. సీఎం రేవంత్‌పై పీకే శపథం నెరవేరేనా?