Beerla Ilaiah: కొత్త వివాదంలో ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య.. పొంచి ఉన్న పదవి గండం? అసలేం జరిగింది?

బీర్ల ఐలయ్య కుటుంబానికి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు గ్రామాల ప‌రిధిలో దాదాపు 250 ఎక‌రాల భూమి ఉన్నట్లు భూభార‌తి రికార్డుల్లో వెల్లడ‌వుతోంది.

Beerla Ilaiah: కొత్త వివాదంలో ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య.. పొంచి ఉన్న పదవి గండం? అసలేం జరిగింది?

Updated On : October 24, 2025 / 10:30 PM IST

Beerla Ilaiah: తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను వ‌రుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిల‌య్య ఎపిసోడ్ తెర‌పైకి వ‌చ్చింది. త‌న ఇంట్లో ప‌నిచేసే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహ‌త్య చేసుకోవ‌డంపై బీర్ల ఐల‌య్య వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఆయనపై భూదందా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఎన్నిక‌ల అఫిడవిట్‌ అంశం తెర‌పైకి వ‌చ్చింది. బీర్ల ఐల‌య్య త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌నే ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఆస్తుల వివ‌రాల‌కు సంబంధించి వాస్తవాల‌ను దాచిపెట్టి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన‌ట్లు పలువురు బీర్ల ఐలయ్యపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

బీర్ల ఐల‌య్య కుటుంబానికి 250 ఎక‌రాల‌కుపైగా భూమి..?

ఎన్నికల అఫిడ‌విట్‌లో స్థిరాస్తుల‌ను ఉద్దేశ‌పూర్వకంగా దాచి పెట్టిన‌ట్లు విమ‌ర్శలు వస్తున్నాయి. బీర్ల ఐల‌య్య కుటుంబానికి 250 ఎక‌రాల‌కుపైగా భూమి ఉంటే..అఫిడ‌విట్‌లో మాత్రం కేవ‌లం 30 ఎక‌రాలు మాత్రమే చూపించార‌ని.. మిగ‌తా భూమిని కావాల‌నే చూపించ‌లేద‌నే అలిగేషన్స్ వ‌స్తున్నాయి. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ స‌ఫ‌ర‌ర్స్ అసోసియేష‌న్..ట్రెసా అధ్యక్షుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించినందుకు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరారు.

ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ను ప్రజా ప్రాతినిధ్య చ‌ట్టం 1951లోని సెక్షన్ 33, 12ఏ నిబంధ‌న‌ను బీర్ల ఐల‌య్య ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. బీర్ల ఐలయ్య కుటుంబానికి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు గ్రామాల ప‌రిధిలో దాదాపు 250 ఎక‌రాల భూమి ఉన్నట్లు భూభార‌తి రికార్డుల్లో వెల్లడ‌వుతోంది. ఈ రికార్డుల‌తో పాటు భూస్వామ్య ప‌త్రాలు, మ్యాపులు, రికార్డు కాపీలు కూడా ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు అందాయి.

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్థులు స‌మ‌ర్పించే అఫిడ‌విట్ విష‌యంలో ఎన్నికల సంఘం చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. త‌ప్పుడు అఫిడ‌విట్లు స‌మర్పిస్తే వారిపై చ‌ర్యలు తీసుకుంటుంది. ఆస్తుల విష‌యంతో పాటు ప్రతీ అంశాన్ని అఫిడ‌విట్‌లో పొందు ప‌ర‌చాల్సి ఉంటుంది. తెలియ‌క పొర‌పాటు జ‌రిగింద‌ని చెప్పినా..ఈసీ, న్యాయ‌స్థానాలు ఉపేక్షించ‌వు.

గ‌తంలో వ‌న‌మా వెంక‌టేశ్వరరావు, గ‌ద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహ‌న్ రెడ్డి అఫిడ‌విట్‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. అఫిడ‌విట్‌ల‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఎమ్మెల్యే ప‌ద‌వికి అనర్హుడిగా ప్రక‌టించింది. దీంతో అప్పట్లో ఈ ఇద్దరు నేత‌లు సుప్రీంకోర్టు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మ‌ళ్లీ విచార‌ణ జ‌రిగే లోపు ఎన్నిక‌లు రావ‌డంతో కేసు హోల్డ్‌లోకి వెళ్లింది.

పొంచి ఉన్న పదవి గండం..!

ఇప్పుడు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అఫిడ‌విట్ కూడా చ‌ర్చనీయాంశంగా మారింది. ఆస్తుల‌కు సంబంధించి భూముల వివ‌రాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉండ‌టంతో ఐలయ్యకు కూడా ప‌ద‌వి గండం ఉంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఈసీ ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటుందో..తన మీద వచ్చిన ఆరోపణలకు బీర్ల ఐలయ్య ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

Also Read: పూర్తిగా కోలుకున్న కేసీఆర్..! ఫాంహౌస్‌ను వీడి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారా?