Gossip Garage : హెచ్‌సీయూ భూవివాదం.. రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం..!
హెచ్‌సీయూ భూముల అంశం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని షేక్ చేస్తోంది.

Gossip Garage : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ సర్కార్‌తో పాటు జాతీయ కాంగ్రెస్‌ను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుందా..? హెచ్‌సీయూ భూముల వివాదం ఢిల్లీ ఏఐసీసీ భవనాన్ని టచ్ చేసిందా.? సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వరుస ఫిర్యాదుల రావడంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగిందా..? అసలు హెచ్‌సీయూ భూముల బాగోతం ఏంటో తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ నటరాజన్‌ను రంగంలోకి దింపింది అధిష్టానం. ఇంతకీ హెచ్‌సీయూ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచన చేస్తోంది..?
కంచ గచ్చిబౌలి భూవివాదం తెలంగాణ సర్కార్‌నే కాదు కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భూముల విషయంలో విద్యార్థి సంఘాలు గళమెత్తడం.. ప్రతిపక్ష పార్టీలు గొంతు కలపడంతో సమస్య తీవ్రమైంది. ఇష్టారాజ్యంగా చెట్లను నరికేసిన ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది. ఆఖరికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం NSUI సైతం రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. విషయాన్ని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిందట NSUI.
Also Read : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ..? అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి..
రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ..
మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు కూడా కంచ గచ్చిబౌలి భూముల రచ్చను రాహుల్ గాంధీకి చేరవేశారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేయగా.. హరీశ్‌రావు నేరుగా రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ఈ పరిణామాలతో కంచ గచ్చిబౌలి భూవివాదం ఢిల్లీ ఏఐసీసీ భవనాన్ని టచ్ చేసింది.
అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారట. హెచ్‌సీయూతో రాహుల్‌కు ప్రత్యేక అనుబంధం ఉండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫోన్ చేసి విషయంపై ఆరా తీశారట. రాహుల్ గాంధీ ఆదేశాలతో మీనాక్షి వెంటనే హైదరాబాద్‌కు వచ్చి మంత్రుల దగ్గర ఆ వివరాలు సేకరించారు.
రాహుల్ గాంధీ ఆదేశాలతో హైదరాబాద్ కు మీనాక్షి..
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వాస్తవానికి ఏప్రిల్ 16న హైదరాబాద్ వచ్చేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో ఆగమేఘాల మీద మీనాక్షి శుక్రవారం రాత్రే మధ్యప్రదేశ్ నుంచి రైల్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. శనివారం మీనాక్షి నటరాజన్ మౌనవ్రతం ఉన్నా.. తెలంగాణ సచివాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ఏం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి? హెచ్‌సీయూ విద్యార్థుల వాదన ఏంటి? ఇలా అన్ని వివరాలను సేకరించారు మీనాక్షి నజరాజన్.
హెచ్‌సీయూ అంశాన్ని రాహుల్ గాంధీ సీరియస్‌గా తీసుకున్నారన్న విషయాన్ని మీనాక్షి నటరాజన్ మంత్రులకు వివరించారు. హెచ్‌సీయూ భూముల్ని ప్రైవేట్ పరం చేయవద్దని.. వాటిని ప్రభుత్వం కాపాడాలని మీనాక్షి సూచించారని తెలుస్తోంది. భూములను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీయడంతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తెలుసుకున్నారట.
Also Read : మంత్రివర్గంలో భారీ మార్పులు? అమాత్యులను టెన్షన్ పెడుతున్న క్యాబినెట్ విస్తరణ అంశం..
ప్రభుత్వం సైతం అక్కడ ఏకో టూరిజం పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు మీనాక్షికి యాక్షన్ ప్లాన్ వివరించిందని తెలుస్తోంది. మంత్రులతో పాటు యూనివర్సిటీకి చెందిన NSUI విద్యార్థి సంఘం నేతలతో కూడా భేటీ అయ్యారు మీనాక్షి. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులు ఏంటనే విషయాలను కూడా తెలుసుకున్నారు. యూనివర్సిటీ భూముల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మీనాక్షి భరోసా ఇచ్చారట.
సో.. మొత్తం మీద హెచ్‌సీయూ భూముల అంశం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని షేక్ చేస్తోంది. మొత్తానికి కంచ గచ్చిబౌలి భూ వివాదంపై కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. మరి మీనాక్షి చౌదరి ఇచ్చే నివేదికతో హైకమాండ్ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ సర్కార్‌కు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.