Talasani Srinivas Yadav: అల్లుడికి విషెస్ సరే.. సునీతకు ఓదార్పు ఏది? బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా తలసాని తీరు..

కేటీఆర్, హరీశ్‌రావు మొదలు మాజీ మంత్రులంతా జూబ్లీహిల్స్ లో మకాం వేసి బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసినా..తలసాని మాత్రం అంటీ ముట్టనట్లు ఉండిపోయారన్న టాక్ ఉంది.

Talasani Srinivas Yadav: అల్లుడికి విషెస్ సరే.. సునీతకు ఓదార్పు ఏది? బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా తలసాని తీరు..

Updated On : November 19, 2025 / 10:53 PM IST

Talasani Srinivas Yadav: అల్లుడు అల్లుడే.. పార్టీ పార్టీనే అంటున్నారు ఆ సీనియర్ నేత. రాజకీయం వేరు..కుటుంబం వేరని చెప్పకనే చెప్పారాయన. అల్లుడు, మామ చెరో పార్టీలో ఉండి బైపోల్‌ ఫైట్‌ చేసి..ఇప్పుడు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మామా, అల్లుళ్లు ఒకరిని ఒకరు సత్కరించుకోవడం ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌ అవుతోంది. ప్రత్యర్ధి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అల్లుడిని సత్కరించిన సదరు మామ..సొంత పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహిళా అభ్యర్ధిని మాత్రం కనీసం ఓదార్చకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఎవరా మామా, అల్లుళ్లు.. ఏంటా కథ.?

అల్లుడు కాంగ్రెస్‌లో..మామ బీఆర్ఎస్. ఎన్నికలకు ముందే ఈ చర్చ జరిగింది. తలసాని శ్రీనివాస్‌ సపోర్ట్ నవీన్‌ యాదవ్‌కా లేక..బీఆర్ఎస్‌ క్యాండిడేట్‌కా అన్న టాక్ నడిచింది. అయితే నవీన్‌ తనకు అల్లుడు అయినా..బంధుత్వం వేరు రాజకీయం వేరంటూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తలసాని. హోరాహోరీగా సాగిన బై ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్‌ యాదవ్‌..తలసానిని కలవడం ఆసక్తికరంగా మారింది.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..

మామ, అల్లుడు ఇద్దరూ ఒకరిని ఒకరు సత్కరించుకోవడం..ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో..తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెతను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా తలసాని వ్యవహరించిన తీరు డిఫరెంట్‌గానే ఉన్నా..అప్పుడు పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నవీన్ యాదవ్, ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలవడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అల్లుడు అవుతాడన్న సంగతి అందరికీ తెలుసు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న కూతురును నవీన్ యాదవ్ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి నవీన్ యాదవ్, తలసాని చాలా దగ్గరి బంధువులు. ఈ క్రమంలోనే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన అల్లుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయడంతో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత సైలెంట్‌గా ఉండిపోయారు.

అల్లుడు నవీన్ యాదవ్‌ పేరు తీయాల్సి వస్తుందని..

కేటీఆర్, హరీశ్‌రావు మొదలు మాజీ మంత్రులంతా జూబ్లీహిల్స్ లో మకాం వేసి బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసినా..తలసాని మాత్రం అంటీ ముట్టనట్లు ఉండిపోయారన్న టాక్ ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో కేటీఆర్ రోడ్ షో లో మాత్రం పాల్గొన్నారాయన. కానీ ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రచారంలో మాట్లాడలేదు. తాను మాట్లాడితే కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో తన అల్లుడు నవీన్ యాదవ్‌ పేరు తీయాల్సి వస్తుందని తలసాని భావించారట. అందుకే తాను పెద్దగా ప్రచారం చేయనని, తన సామాజిక వర్గం, తన కుటుంబం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి దూరంగా ఉంచాలని తలసాని ముందుగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఇన్‌సైడ్‌ టాక్. కేటీఆర్ కూడా తలసాని పరిస్థితిని అర్ధం చేసుకుని జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి అంతర్గత సమావేశాల్లో మినహా ప్రచారానికి పిలవలేదు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ తన మామ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. తలసాని ఇంటికి వెళ్లిన నవీన్ యాదవ్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మామ తలసానిని నవీన్ యాదవ్ శాలువా కప్పి సత్కరించారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అల్లుడు నవీన్ యాదవ్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అల్లుడు..అదీ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇంటికి వస్తే ఇక ఆ మర్యాదలు, సంతోషాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే తలసాని ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్‌ను కలవడం, సత్కరించడాన్ని పెద్దగా తప్పుపట్టకపోయినా.. సొంత పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధి మాగంటి సునీతను కనీసం ఓదార్చలేదని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆమెతో పాటు కుటుంబానికి ధైర్యం చెప్పారు. కానీ తలసాని కనీసం కేటీఆర్‌తో కూడా వెళ్లలేదని, అదే నవీన్ యాదవ్ అల్లుడు కాబట్టి ఇంటికి పిలిపించుకుని మరీ సత్కరించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక పక్కానా? అక్క, లేకపోతే తమ్ముడిని బరిలో దించే ప్లాన్ లో బీఆర్ఎస్..