Gossip Garage : పూర్వ వైభవం రావాలంటే పేరు మార్పే బెటర్ అనుకుంటున్నారా?

తెలంగాణ వాదం తమ పేటెంట్‌గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.

Gossip Garage : పూర్వ వైభవం రావాలంటే పేరు మార్పే బెటర్ అనుకుంటున్నారా?

Gossip Garage Brs To Trs (Photo Credit : Google)

Updated On : November 28, 2024 / 12:16 AM IST

Gossip Garage : పార్టీ పేరు మారింది. ఆ తర్వాత పరిస్థితులు కలిసి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రభావమే చూపలేని పరిస్థితి. పార్టీ పేరు మార్చినప్పుడే తెలంగాణతో కేసీఆర్ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్న టాక్ వినిపించింది. ఈ అభిప్రాయం ఇప్పుడు గులాబీ దళంలోనూ వ్యక్తం అవుతోందట. దాంతో బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి కాబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో దళపతి ఆలోచన ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బీఆర్ఎస్..టీఆర్ఎస్‌గా మారడం ఖాయమేనా.? పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడాన్ని మైనస్‌గా భావిస్తున్నారా.?

పార్టీ పేరు మార్పు తర్వాత వరుస పెట్టి ఓటములు..
తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పార్టీ 2001లో ప్రారంభమైనప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో..తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాజకీయంగా సత్తా చాటుతూనే వచ్చింది. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన గులాబీ బాస్ రెండేళ్ల ముందు పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. ఆ తర్వాత గులాబీ పార్టీకి పరిస్థితులు అంతగా కలసి రాలేదు. వరుస పెట్టి ఓటములతో పాటు..ప్రజలతో గ్యాప్‌ వచ్చిందని..పార్టీ గ్రాప్ పడిపోయిందని పలు రకాల అభిప్రాయాలు గులాబీ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పేరును..టీఆర్‌ఎస్‌గా మార్చితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ పేరు మార్పు ప్రజల నుంచి దూరం చేసిందన్న అభిప్రాయం..
పార్టీ పేరు మార్పు తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసిందన్న అభిప్రాయాన్ని అంతర్గత సమావేశాల్లో కీలక నేతలు వ్యక్తం చేశారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ అంశంపై చాలా జరిగింది. పార్టీ పేరు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా చేయాలన్న డిమాండ్ కూడా అప్పటి నుంచో తెరపైకి వచ్చింది. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత కారు పార్టీలో పేరు మార్పు చర్చ మళ్లీ జోరందుకున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గులాబీ నేతలు స్పందించిన తీరు చూస్తుంటే తెలంగాణ వాదమే పార్టీకి బలమని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రాంతీయ పార్టీలే దేశంలో బలంగా ఉన్నాయని అంటున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. అంతే బీజేపీని ప్రాంతీయ పార్టీలే అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్ పూర్తిగా విఫలమైతుందన్న వాదనను కూడా తెరపైకి తెచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని ఎప్పటి నుంచో చర్చ..
తెలంగాణలో కూడా తెలంగాణ వాదం తమ పేటెంట్‌గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది. పార్టీ కార్యకర్తల సమావేశాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో..తెలంగాణ వాదులంతా ఒక్కటిగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మహారాష్ట్రలో బీజేపీ నినాదమైన భటెంగేతో..కటెంగే అన్న నినాదం మారుమోగుతోంది. గులాబీ పార్టీ ఈ నినాదాన్ని రాష్ట్రంలో అందుకుంది. తెలంగాణ వాదం నుంచి కార్యకర్తలు విడిపోతే..చెడిపోతామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి.

తెలంగాణ జాగృతి పేరుతోనే కులగణన కమిటీకి కవిత వినతిపత్రం..
పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ జాగృతి పేరుతో గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో జాగృతిని కూడా భారత జాగృతిగా మార్చి జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆందోళన కూడా చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారత జాగృతి కూడా తెలంగాణ జాగృతి పేరుతోనే ప్రజల్లోకి వస్తుంది. ఈ మధ్యే పొలిటికల్‌ గా యాక్టివ్ అయిన కవిత తెలంగాణ జాగృతి పేరుతోనే బీసీ రిజర్వేషన్లపై కులగణన కమిటీకి వినతిపత్రం ఇచ్చారు.

భారత రాష్ట్ర సమితి పేరు నామమాత్రమేనా?
ఈ పరిణామాలు చూస్తుంటే భారత రాష్ట్ర సమితి పేరును నామమాత్రంగానే వాడుకునేలా గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు మార్చాలని భావిస్తున్న టెక్నికల్‌గా అది సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని గులాబీ బాస్‌ కూడా ఆ మధ్య స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు మారకపోతే తెలంగాణ సెంటిమెంట్‌నే తమ అస్త్రంగా మలుచుకునేందుకు గులాబీ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

 

 

Also Read : క్యాబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్? అమాత్యయోగం దక్కేదెవరికి?