Harish Rao: ఖమ్మం వస్తున్న రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: మంత్రి హరీశ్ రావు
రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని హరీశ్ రావు అన్నారు.

Harish Rao
Harish Rao – Rahul Gandhi: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం (Khammam) జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావ్ పాల్గొని మాట్లాడారు. పోడు పట్టాలను కాంగ్రెస్ హయాంలో మధ్యలో వదిలేశారని, బీఆర్ఎస్ అటువంటి పని చేయలేదని అన్నారు.
రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని హరీశ్ రావ్ అన్నారు. ఖమ్మం వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని మంత్రి అడిగారు. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా? అని నిలదీశారు.
వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయరుగాని.. మన దగ్గరకు వచ్చి పెద్దపెద్ద హామీలు ఇస్తారని విమర్శించారు. తాము ఖమ్మంలో పదికి తొమ్మిది స్థానాలు గెలుస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా ఆసరా రూ.2,000/4,000 ఇస్తున్నారా అని నిలదీశారు. రైతుబంధు, రైతు బీమా ఇస్తున్న రాష్ట్రం ఉందా? కల్యాణ లక్ష్మీ అమలు జరుగుతుందా? మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారా?
కాళేశ్వరం ప్రాజెక్టులాంటిది కట్టారా? కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ కిట్లు వంటివి ఇస్తున్నారా? తెలంగాణలో అమలవుతున్నటువంటి ఏ ఒక్క పథకమైన అమలవుతుందా? అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు సాగునీళ్లు కోసం ధర్నాలు రాస్తోరోకులు జరిగాయని చెప్పారు. రైతన్నలు కరెంటు కోసం సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
గతంలో కాంగ్రెస్ పూర్తిగా ఇచ్చి ఉంటే ఇప్పుడు తాము ఇచ్చే పరిస్థితి ఉండేదా అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా అమలు చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టనివి కూడా అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటాయి తప్ప ఆచరణలో లేవని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానాలకు వెళ్లాలంటే భయపడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.