విజయవంతంగా సీఎం ఎగ్గొట్టారు.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: హరీశ్ రావు
కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని, రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తోందని చెప్పారు.

Harish rao
తెలంగాణ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారని అన్నారు. సంగారెడ్డిలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని తెలిపారు.
తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని, రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తోందని చెప్పారు. రైతులు మళ్లీ పైరవికారులు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ఉన్నప్పుడు టింగుటింగు మని రైతు బంధు వచ్చేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చి కొన్ని వార్తలు రాయిస్తుందని, పంట పండించే భూములకు రైతు భరోసా ఇస్తామంటున్నారని తెలిపారు. దీనివల్ల పండ్ల తోటలు, ఆయిల్ పామ్, చెరుకు రైతులు నష్టపోతారని చెప్పారు.
Hyderabad metro: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణ.. రేవంత్ కీలక నిర్ణయం