Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ హరీశ్ రావు

ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు..

Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ హరీశ్ రావు

Harish Rao

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడారని, అవగాహనా రాహిత్యాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారని చెప్పారు.

ఒకవైపు మేడిగడ్డ  పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే  మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు అని అంటున్నారని విమర్శించారు. ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన NDSA, వర్షాకాలం వరదలు రాకముందే.. జులై మొదటి వారం లోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొన్నదని తెలిపారు.

NDSA సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్ లు ఆపివేసినట్టు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హమని చెప్పారు. గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజి పునరుద్దరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలమైందని హరీశ్ రావు అన్నారు.

వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని చెప్పారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాక గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఇంకా ఎంతకాలం చేస్తారని నిలదీశారు. వానాకాలం ముగిసే నాటికి NDSA నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబందించిన నివేదికను తెప్పించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని ఉత్తమ్ ను కోరుతున్నానని అన్నారు.

Also Read: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతాం- విజయసాయిరెడ్డి