Yadadri Temple: ఒక్కసారి వర్షానికే కుంగిపోయిన యాదాద్రి ఘాట్ రోడ్డు

యాదగిరిగుట్టపై ఘాట్‌ రోడ్డు ఒక్క వర్షానికి కుంగిపోయింది. నారసింహుడి సన్నిధిలో నాణ్యతా లోపం బయటపడింది.

Yadadri Temple: ఒక్కసారి వర్షానికే కుంగిపోయిన యాదాద్రి ఘాట్ రోడ్డు

Heavy Rain In Yadadri Temple Damage Ghat Road In Telangana

Updated On : May 4, 2022 / 12:38 PM IST

Yadadri Temple: యాదగిరిగుట్టపై ఘాట్‌ రోడ్డు ఒక్క వర్షానికి కుంగిపోయింది. నారసింహుడి సన్నిధిలో నాణ్యతా లోపం బయటపడింది. పార్కింగ్ బాదుడుపై ఉన్న శ్రద్ధ..నాణ్యతపై లేదా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరిత ద్రోణి ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కుండపోత వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టు సైతం తడిసి ముద్దయింది. బుధవారం (మే 4,2022) తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు కుండపోత వర్షం కురిసింది.

కుండపోత వర్షానికి యాదాద్రిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీటి ధాటికి ఘాట్‌ రోడ్డు దెబ్బతింది. ఆలయ క్యూకాంప్లెక్స్‌లు వరద నీటితో నిండిపోయాయి. యాదగిరి గుట్ట బస్టాండ్‌ ప్రాంగణంలోకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండపై నుంచి వర్షపు నీరు దిగువ ఉన్న కాలనీల్లోకి చేరాయి. దీంతో ఆ ప్రాంతమంతా చెరువులా మారింది.

యాదాద్రి కొండపై నుంచి కిందికి నూతనంగా నిర్మించిన రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలినడకతోనే కొండపైకి చేరుకుంటున్నారు. నూతన నిర్మించిన ఘాట్‌ రోడ్డు దెబ్బతినడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోడ్డు కుంగిపోయిందని భక్తులు విమర్శిస్తున్నారు. నాణ్యత లేకుండా నిర్మించటం వల్లనే ఒక్క వర్షానికి రోడ్డు కుంగిపోయింది అని మండిపడుతున్నారు. పార్కింగ్‌పై పెట్టిన దృష్టి రోడ్లపై పెట్టలేదని ఫైర్ అవుతున్నారు. కొండపై పార్కింగ్‌కు ఐదు వందల రూపాయలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.