బీఆర్ఎస్ సభ అనుమతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి..: హైకోర్టు
వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన రజతోత్సవ సభపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

High Court,
BRS Warangal Meeting: వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన రజతోత్సవ సభపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ విచారణ జరిపి కోర్టు.. ప్రతివాదులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. భారీ ఎత్తున సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సభ నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని వరంగల్ పోలీసులను బీఆర్ఎస్ ఆశ్రయించింది. అయితే, అందుకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవటంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. సభకోసం బీఆర్ఎస్ పెట్టుకున్న పర్మిషన్ ను అనుమతించక పోవటం, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్లనే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు బీఆర్ఎస్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ సీపీ, కాజీపేట ఏసీపీని బీఆర్ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరపు న్యాయవాది సమయం కోరారు. ఈనెల 21 వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కోర్టు ఈనెల 17 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.