హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. వడగళ్ల వాన
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, ఎస్సార్ నగర్, బోరబండ, అమీర్‌పేట, పంజాగుట్టలో ఓ మోస్తరు వర్షం పడుతోంది.
బషీర్‌బాగ్, నారాయణ గూడ్, ఖైరతాబాద్‌లో వడగళ్ల వాన కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు వెళ్తున్నాయి. మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, దిల్‌సుక్ నగర్‌లో వర్షం పడుతోంది.
కుత్బుల్లాపూర్ పరిసరాల్లో, హిమాయత్‌నగర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గుండ్లపోచంపల్లి, దుండిగల్, దూలపల్లి, బహదూర్ పల్లిలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు.
అలాగే, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అరకు, పాడేరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచాయి. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.