హైదరాబాద్ కాచిగూడలో దారుణం.. కిన్లె, బిస్లరీ పేర్లతో కల్తీ నీటి వ్యాపారం..

ఈ తనిఖీల్లో 60 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ తో పాటు భారీగా బాటిల్స్ ను సీజ్ చేశారు.

హైదరాబాద్ కాచిగూడలో దారుణం.. కిన్లె, బిస్లరీ పేర్లతో కల్తీ నీటి వ్యాపారం..

Updated On : November 14, 2024 / 11:12 PM IST

Illegal Packaged Drinking Water Business : హైదరాబాద్ కాచిగూడ నింబోలి అడ్డాలో కల్తీ నీటి వ్యాపారం చేస్తున్న ఓ వాటర్ ప్లాంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. కిన్లె, బిస్లరీ, నాచురల్ బ్లూ వంటి బ్రాండెడ్ కంపెనీల పేర్లలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కల్తీ నీటిని విక్రయిస్తోంది ఓ ముఠా. అక్రమంగా కల్తీ నీళ్లను బాటిల్స్ లో నింపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో 60 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ తో పాటు భారీగా బాటిల్స్ ను సీజ్ చేశారు.

ప్లాంట్ ను నిర్వహిస్తున్న యజమాని అబ్దుల్ ఒమర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోర్ నీటిలో మినరల్స్ కలిపాల్సి ఉండగా.. ప్లాంట్ యజమాని మాత్రం ఎలాంటి మినరల్స్ కలపకుండానే నీటిని బాటిల్స్ లో నింపుతూ కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీ దందాతో కాసుల సంపాదిస్తున్నారు. తినే తిండినే కాదు చివరికి తాగే నీటిని కూడా కల్తీ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేర్లు కొంత అటు ఇటు మార్చేసి, లేబుల్స్ తగిలించి, తమ కల్తీ సరుకును మార్కెట్ లో విక్రయించేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా దందాను నడిపిస్తున్నారు. కాచిగూడ నింబోలి అడ్డాలో వెలుగుచూసిన కల్తీ తాగునీటి దందా కలకలం రేపుతోంది. బోర్ వాటర్ లో ఎలాంటి మినరల్స్ కలపకుండానే బాటిల్స్ లో నింపి బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ తగిలించి మార్కెట్ లో ఆ వాటర్ బాటిల్స్ ను అమ్ముకుంటున్నాడు.

చివరికి అతడి పాపం పండింది. అధికారులు వాటర్ ప్లాంట్ పై దాడులు చేసి కల్తీ నీటి దందా గుట్టు రట్టు చేశారు. బాటిల్స్ లో ఉన్న ఆ నీరు మంచిదే అనుకుని జనాలు కొనుగోలు చేసి తాగేస్తున్నారు. ఆ తర్వాత జబ్బుల బారిన పడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకుండా ఉండే రీతిలో శిక్షలు ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

Also Read : బాబోయ్.. కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి..!