Kishan Reddy : భారత ఎంబసీ ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయొద్దని రష్యా, యుక్రెయిన్లను కోరాం-కిషన్ రెడ్డి
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. యుక్రెయిన్, రష్యా ఎంబసీ అధికారులతో భారత దౌత్య అధికారులు

Kishan Reddy
Kishan Reddy : యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. యుక్రెయిన్, రష్యా ఎంబసీ అధికారులతో భారత దౌత్య అధికారులు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. భారత ఎంబసీ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి దాడులు చేయొద్దని ఇరుదేశాలను కోరుతున్నామని వెల్లడించారు. దానికి సంబంధించి రష్యా ఎంబసీతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానాలు నడిపే పరిస్థితి అక్కడ లేదన్నారు కిషన్ రెడ్డి. రోడ్డు మార్గాన సైతం వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.
ఇలాంటి సమయంలో సైతం ఇతర దేశాల వారిని కూడా భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి వారి దేశాలకు పంపించామని కిషన్ రెడ్డి తెలిపారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రధాని కానీ కేంద్ర విదేశాంగ మంత్రి కానీ నిర్ణయం తీసుకుంటారని, దానిపైన నేను మాట్లాడటం మంచిది కాదని కిషన్ రెడ్డి చెప్పారు. శాంతిగా ఉండాలనేది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫండమెంటల్ పాలసీ అని చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని, భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.
CM Jagan : యుక్రెయిన్‌లోని తెలుగు వారి కోసం అధికారులను నియమించిన సీఎం జగన్
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. యుక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుక్రెయిన్‌లోని అన్ని నగరాలపై దాడులు చేస్తోంది. రష్యా దాడిలో 40 మంది యుక్రెయిన్ సైనికులు మృతిచెందారు. పదిమందికి పైగా సామన్య పౌరులు మృతిచెందినట్టు ప్రకటించారు. రష్యా దాడులను యుక్రెయిన్ సైనిక దళం కూడా తిప్పికొడుతోంది. కాగా, రష్యా దాడుల నేపథ్యంలో యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు బిక్కుమంటూ గడుపుతున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 18వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. యుక్రెయిన్‌లో గగనతలం మూసివేసిన క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని భారతీయులందరి భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. యుక్రెయిన్‌లోని పలువురు విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. అలాగే, యుక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులకు ఆహారం, నీళ్లు, విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి అన్నారు.