ఆ పార్టీలోకి గంగుల కమలాకర్? ఆ పోస్టు పెట్టింది అందుకేనా?

సీఎం రేవంత్ రెడ్డి, గంగుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలో చెరోగూటికి చేరారు.

ఆ పార్టీలోకి గంగుల కమలాకర్? ఆ పోస్టు పెట్టింది అందుకేనా?

Gangula Kamalakar : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ మారబోతున్నారనే చర్చ జోరందుకుంది. కరీంనగర్ లో వరుస విజయాలు సాధిస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు గంగుల. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మంత్రిగా పని చేసిన గంగుల దశాబ్ద కాలంగా కారు పార్టీలోనే జర్నీ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో పాటు బీఆర్ఎస్ పరిస్థితి సరిగా లేకపోవడంతో తిరిగి పార్టీ మారతారు అంటూ పుకార్లు మొదలయ్యాయి.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరూ ఉప్ప నిప్పులా ఉంటారు. ఇద్దరి మధ్య చాలా అంశాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఇటీవల బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కడంతో సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గంగుల శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ మార్పు ప్రచారానికి ఊతమిచ్చినట్లు అయ్యింది. ఈ పోస్టును ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకుంటున్నారు. గంగుల మాత్రం నో కామెంట్ అన్నట్లుగా మౌనం వహిస్తున్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, గంగుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలో చెరోగూటికి చేరారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గంగుల హస్తం గూటికి చేరతారనే ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్.. గంగుల కమలాకర్ రాకకు అడ్డు చెప్పినట్లుగా మరో టాక్ వినిపించింది.

అయితే, కరీంనగర్ పర్యటనలో గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లిన కేసీఆర్, కేటీఆర్.. పార్టీ మారకుండా గంగులకు నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది. గంగుల కూడా పార్టీ మారటం లేదనే స్పష్టతనివ్వడంతో కొన్నిరోజుల పాటు జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం బీజేపీ పుంజుకోవడంతో కరీంనగర్ లో బండి సంజయ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి దక్కించుకోవడంతో గంగుల కమలాకర్ పంతాలు పక్కన పెట్టి బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కాషాయ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యే పోస్టు పెట్టి ఉంటారనే టాక్ నడుస్తోంది.

Also Read : ఏపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి- హరీశ్ రావు చురకలు