IT Raids : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

IT Raids : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు

Vivek Venkataswamy

Vivek Venkatswamy : మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలోని ఆయన నివాసంలో, హైదరాబాద్ సోమాజిగూడలోని నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 5గంటలకే ఐటీ అధికారులు వివేక్ నివాసాలకు చేరుకొని సోదాలు చేస్తున్నారు.

గత కొన్నిరోజుల నుంచి వివేక్ కు చెందిన కంపెనీల డబ్బును చెన్నూర్ నియోజకవర్గంలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఐటీ అధికారులకు సమాచారం అందించడంతో ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం వరకు వివేక్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ఇటీవల ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం చెన్నూరు నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. వివేక్ ఇంటిపై ఐటీ దాడులను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఆయన నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని ఐటీ దాడులకు నిరసనగా ఆందోళనకు దిగారు.

Also Read : Nalgonda : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?