Mutthireddy Yadagiri Reddy : అవును నేను గూండానే, కేసీఆర్‌కు సైనికుడిని- వ్యతిరేకవర్గం నేతలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్
చాయ్ లు సమోసాలు తినే వాళ్లు కొందరు నిన్న హరిత ప్లాజాలో జరిగిన మీటింగ్ లో ఉన్నారు. Mutthireddy Yadagiri Reddy - Jangaon

Mutthireddy Yadagiri Reddy
Mutthireddy Yadagiri Reddy – Jangaon : జనగామ బీఆర్ఎస్ లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే టికెట్ కోసం జరుగుతున్న లొల్లి తారస్థాయికి చేరింది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రానే లేదు.. అప్పుడే టికెట్ కోసం రచ్చ మొదలైంది. క్యాంపు రాజకీయాలకు తెరలేపారు ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం నేతలు.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, స్థానిక నేతలకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని.. వేరే ఎవరికి ఇచ్చినా సహకరిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే చెప్పేశారు. అంతేకాదు ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇదే సమయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నారని, ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.
జనగామ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. తనకు వ్యతిరేకంగా నేతలు సమావేశం కావడంపై తాజాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు.
”చాయ్ లు సమోసాలు తినే వాళ్లు కొందరు నిన్న హరిత ప్లాజాలో జరిగిన మీటింగ్ లో ఉన్నారు. నా నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ ఆ మీటింగ్ లో లేరు. స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా నాతోనే ఉన్నారు. నిన్న మీటింగ్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరకి నేను వెళ్ళాను. రూమ్ లో ఉండి తలుపులు పెట్టుకున్నారు. అలా భయపడి బతకటం ఎందుకు? నిన్న హోటల్ లో గంప కింద కోళ్లను కమ్మినట్టు కమ్మారు. వాళ్ళ దొంగ బతుకులను చూసి బాధపడ్డా.
అభివృద్ధికి అడ్డంపడితే కఠినంగా వ్యవహరించా. గూండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్ని. గూండాగిరి చేస్తే సింహస్వప్నంలా మారాను. నాపై కావాలని వివాదాలు సృష్టించారు. ఈ కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ కు తెలుసు.. నేను కేసీఆర్ కు సైనికుడిని” అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలని బలపరుస్తూ.. నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి నేతలు తీర్మానాలు అందజేశారు.