కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. సమగ్రమా? తూతూ మంత్రమా?
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిధుల గోల్‌మాల్ నిజంగా బయటపడాలంటే, ప్రాజెక్టు మొత్తం మీద జరిగిన ఖర్చు మీద, ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్యాకేజీల మీద సమగ్ర విచారణ జరపాలన్నది సుస్పష్టం.

Kaleshwaram Project Corruption Row
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జ్యుడీషియల్ విచారణ ద్వారా, ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున గోల్‌మాల్‌కు పాల్పడిన కాంట్రాక్టర్ బండారం బయటపడుతుందా ? లేదా సదరు కాంట్రాక్టర్ సేఫ్‌గా బయటపడేందుకు మార్గం దొరుకుతుందా? విచారణ పరిధిని కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో జరిగిన డిజైన్, నాణ్యత లోపాల వరకే పరిమితం చేసి, అసలు మతలబు జరిగిన ప్యాకేజీల సంగతిని ప్రస్తావించకపోవడంతో ఈ అనుమానం తలెత్తుతోంది.
అసలు మతలబు జరిగిన ప్రాజెక్టు కంపోనెంట్స్ వేరే..
దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో, ప్రస్తుతం విచారణ పరిధిలోకి రానున్న మూడు బ్యారేజీల మీద కలిపి పెట్టిన ఖర్చు 10వేల కోట్ల రూపాయలలోపే ఉంది. అంటే.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఈ మూడు బ్యారేజీల వాటా 10 శాతానికిలోపే. అసలు మతలబు జరిగిన ప్రాజెక్టు కంపోనెంట్స్ వేరేగా ఉన్నాయి. వీటిలో పంప్‌హౌజ్‌ల నిర్మాణం, వాటికి అవసరమైన మోటార్ల సరఫరా ముఖ్యమైనవి.
లాభదాయకమైన ప్యాకేజీలను మాత్రమే తీసుకుని..
అత్యంత లాభదాయకమైన ఈ ప్యాకేజీలను పొందిన బడా కాంట్రాక్టు సంస్థే.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో, ప్రాజెక్టు పనులను వివిధ ప్యాకేజీలుగా విభజించడంలో పెద్దన్న పాత్ర పోషించింది. అత్యంత లాభదాయకమైన ప్యాకేజీలను ఈ బడా కాంట్రాక్టు సంస్థ చేపట్టి, మిగిలిన ప్యాకేజీలను ఇతర కాంట్రాక్టర్లకు వదిలేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read : టార్గెట్ 12.. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
పంప్‌సెట్లు, మోటార్ల సరఫరాలోనే భారీ అవినీతి!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌజ్‌ల మోటార్ల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది రోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజీ వద్ద సహచర మంత్రుల సంమక్షంలోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అసెంబుల్డ్ మోటార్లను స్థానిక కంపెనీల నుంచి సమకూర్చుకున్నారని వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లకు, 4 వేల కోట్ల రూపాయల చొప్పున కాంట్రాక్టర్‌కు చెల్లించారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
రూ.5,188 కోట్ల అయాచిత లబ్ధి పొందిన కాంట్రాక్టర్!
పంప్‌సెట్ మోటార్లకు జరిపిన చెల్లింపులకు సంబంధించి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కూడా తన డ్రాఫ్ట్ నివేదికలో కొన్ని సంచలనాత్మక అంశాలను ప్రస్తావించింది. నాలుగు ప్యాకేజీల్లో పంప్‌సెట్స్, మోటార్లకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ BHEL వెయ్యీ 686 కోట్ల రూపాయలుగా అంచనా వేసిన దానికి బదులుగా, ప్రభుత్వం నుంచి 7 వేల 214 కోట్ల రూపాయలు పొందిన కాంట్రాక్టర్, ఏకంగా 5 వేల 188 కోట్ల రూపాయల అయాచిత ప్రజాధనం పొందారు. కేవలం నాలుగు ప్యాకేజీలకు సంబంధించే ఈ స్థాయిలో భారీ ప్రయోజనం చేకూరిందంటే.. మొత్తం 17 ప్యాకేజీల్లో ఏ స్థాయిలో కాంట్రాక్టర్‌కు ప్రయోజనం జరిగిందో ఊహించుకోవచ్చు.
అప్పుడే.. కాంట్రాక్టర్ల బండారం బయటపడుతుంది
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిధుల గోల్‌మాల్ నిజంగా బయటపడాలంటే, ప్రాజెక్టు మొత్తం మీద జరిగిన ఖర్చు మీద, ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్యాకేజీల మీద సమగ్ర విచారణ జరపాలన్నది సుస్పష్టం. అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టు మీద అవసరానికి మించి పెట్టిన ఖర్చు, ప్రాజెక్టు ద్వారా భారీ ఎత్తున నిధులు దండుకున్న కాంట్రాక్టర్ల బండారం బయటపడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద సమగ్ర విచారణకు సూచన..
ఇలా కాకుండా, కేవలం మూడు బ్యారేజీల నిర్మాణ లోపాల వరకే విచారణ పరిమితమైతే, మొత్తం విచారణ ప్రక్రియ కంటితుడుపు చర్యగా మారి, గోల్‌మాల్ చేసిన బడా కాంట్రాక్టర్ బయటపడిపోవడానికి మార్గం సుగమం అవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాలనే పట్టుదలతో ఉన్న రేవంత్‌రెడ్డి సర్కార్, ఈ అంశంపై దృష్టి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద సమగ్ర విచారణ జరిపించాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో, విచారణ ప్రక్రియ ‘బీటింగ్ ఎరౌండ్ ది బుష్’గా మారి, అసలు మోసం మరుగున పడిపోతుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు.. ప్రభుత్వం సీరియస్, అధికారి సస్పెండ్
సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని బీజేపీ డిమాండ్
మరోవైపు.. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలంటే సీబీఐకి విచారణ బాధ్యత అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేవలం బ్యారేజీల వరకే పరిమితం చేస్తూ జ్యుడీషియల్ విచారణ చేసే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా కాకుండా ప్రాజెక్టు మొత్తంలో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో వెలికి తీయాలంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఏ రకంగా చూసినా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ మొత్తం ‘కృష్ణా’ర్పణం అయ్యిందని, వాటి నుంచే పలువురికి కమీషన్లు ముట్ట చెప్పారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.