కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇదే: కేటీఆర్
"ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడిందని తెలిపారు.
“ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది. జూరాలకు క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి.
ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. సుంకిశాల రిటేనింగి వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లింది.
ఇప్పుడు జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్ లు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టింది. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలి. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని కేటీఆర్ అన్నారు.