Mallu Bhatti Vikramarka: ఆ కార్డు ఇస్తే ఇళ్ల స్థలం ఇస్తాం.. వంట గ్యాస్ రూ.500కే అందిస్తాం: మల్లు భట్టి విక్రమార్క
మూడు నెలల పాటు గ్యారంటీ కార్డును జాగ్రత్తగా ఉంచాలని సూచించారు.

Mallu Bhatti Vikramarka - Tummala Nageswara Rao
Mallu Bhatti Vikramarka – Tummala Nageswara Rao: తెలంగాణ (Telangana) ఎన్నికల వేళ తమ పార్టీ ఆరు గ్యారంటీ కార్డులు ఇచ్చిందని, వాటిని అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో అమలు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు.
డిక్లరేషన్లు అన్నీ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉంటాయని భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసేవి గ్యారంటీ కార్డులో ఉంటాయని వివరించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల ఇళ్లకు వచ్చి కార్డులు ఇస్తే జాగ్రత్తగా ఉంచుకోవాలని అన్నారు.
ఆ కార్డు ఇస్తే ఇళ్ల స్థలం ఇస్తామని, ఇళ్లు కట్టుకోవడానికి నిధులు ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. వంట గ్యాస్ రూ.500కే అందిస్తామని చెప్పారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ 15 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం చేస్తామని అన్నారు. మూడు నెలల పాటు గ్యారంటీ కార్డును జాగ్రత్తగా ఉంచాలని సూచించారు.
తెలంగాణలో సంపద ఉంది కాబట్టి ప్రజలకు పంచుతామని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలా తాము దోచుకోము కాబట్టి ప్రభుత్వ ఖజానాలో డబ్బు ఉంటుందని, దాన్నే ప్రజలకు అందిస్తామని చెప్పారు. హామీలు ఇచ్చే ముందు లోతుగా పరిశీలించామని తెలిపారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారని, ఆయనకు సాదరంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా తాను నిబద్ధత కలిగిన వ్యక్తిగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. ప్రజల కోసమే తన రాజకీయ జీవితాన్ని ఉపయోగిస్తానని అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… దోచుకున్న డబ్బును దాచుకొని, వాటినే వాడుతూ మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మోసం చేశారని తెలిపారు. పేపర్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
YS Sharmila : పార్టీ విలీనంపై షర్మిల సంచలన నిర్ణయం..! కాంగ్రెస్‌కు డెడ్‌లైన్