Telangana : తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య వార్.. ఈసారి కొండా వర్సెస్ పొంగులేటి.. సీఎం వద్దకు పంచాయితీ..? అసలేం జరిగిందంటే..
Telangana : తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వార్ తారాస్థాయికి చేరింది.

Ponguleti Srinivas Reddy Konda Surekha
Telangana : తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్ కొనసాగగా అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే, తాజాగా.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వార్ తారాస్థాయికి చేరింది.
దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం టెండర్లలో ఇంచార్జి మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవటంతో ఆ శాఖకు చెందిన మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.71కోట్ల టెండర్ ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నాడని.. శాఖకు మంత్రిగా ఉన్న తనతో సంబంధం లేకుండా అన్ని తానై పొంగులేటి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అసలు తన శాఖలో పొంగులేటి జోక్యం ఏమిటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పొంగులేటి తీరుతో తనకు ఇబ్బందిగా ఉందని అధిష్టానంకు లేఖ రూపంలో కొండా మురళి ఫిర్యాదు చేశారు. తాజాగా మంత్రి పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి వ్యవహారంతో కిందామీద పడ్డ కాంగ్రెస్ సర్కార్‌కు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైనట్లుగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం అటు ప్రతిపక్ష చేతిలో, హైకోర్టు తీర్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మంత్రుల రచ్చతో ఇక మల్లగుల్లాలు పడుతుంది. మంత్రుల వ్యవహారశైలిపై ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి ఆయన వ్యవహార శైలిపై జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అనేక అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలకమైన నిర్ణయాలను ఇంచార్జి మంత్రి హోదాలో పొంగులేటి తీసుకుంటున్నారని కొండా సురేఖ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కొండా సురేఖ దంపతులు తీసుకెళ్లారని సమాచారం. అయితే, తాజాగా.. మేడారంకు సంబంధించి టెండర్ల విషయంలోనూ పొంగులేటి జోక్యం ఎక్కువైందని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆమె ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.