జీవో నెం. 3ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత
మహిళల హక్కులనుశాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్లను కల్పించడానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసిందని..

MLC Kavitha
MLC Kavitha : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు రెండు రిజర్వేషన్లు కల్పించేలా గతంలో ఆదేశాలు ఉండేవి.. మహిళలకు రోస్టర్ విధానంలో రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని కవిత విమర్శించారు. రోస్టర్ పాయింట్ రద్దు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని, మహిళలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడుతుందని కవిత అన్నారు.
Also Read : BJP MP Laxman : బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిందని కవిత చెప్పారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా హైకోర్టులో పిటీషన్ ను ఉపసంహరించుకుందని అన్నారు. మహిళల హక్కులనుశాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్లను కల్పించడానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసిందని, ఈ జీవో మహిళల ఉద్యోగ అవకాశాలకు శరాఘాతంగా నిలుస్తుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : దమ్ముంటే.. నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
లక్ష మందికిపైగా మహిళలు టీఎస్ పీఎస్సీలో నమోదు చేసుకున్నారని, ఈ విషయం అందరికి తెలియాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే 33.3శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఖచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కన బెడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త జీవో తీసుకురావడం సరైంది కాదన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.3 ను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని, ఈ అంశంపై సోనియాగాంధీకి లేఖ రాస్తామన్నారు. సోనియాగాధీ వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత అన్నారు.