KTR : ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌ విచారణకు హాజరైన కేటీఆర్‌.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హైటెన్షన్

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు.

KTR : ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌ విచారణకు హాజరైన కేటీఆర్‌.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హైటెన్షన్

KTR

Updated On : January 23, 2026 / 12:05 PM IST

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. కేటీఆర్ తో కలిసి హరీశ్ రావు, కేపీ వివేకానంద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వాగ్వాదంకు దిగారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలను సిట్ ఆఫిస్ వద్ద నుంచి పోలీసులు పంపించివేశారు.

పీఎస్ లోపల కేటీఆర్‌ను జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. విచారణ కోసం ముందుగానే సిట్ బృందం ప్రత్యేకంగా ప్రశ్నలను సిద్ధం చేసుకుంది. ఇదిలాఉంటే.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు.. అధికారులు చట్టబదంగా వ్యవహరించాలని అన్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులను వదిలిపెట్టమంటూ హరీశ్ హెచ్చరించారు.

మంత్రులతో సహా మా ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నాడు : కేటీఆర్
సిట్ విచారణకు హాజరయ్యేకంటే ముందు బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదు.. మాకు ఏం సంబంధం లేదని అన్నారు. పదిసార్లు పిలిచినా హాజరవుతా.. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు అంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. 50లక్షలతో నోటుకు ఓటులో దొరికిన ఒక దొంగ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఈ రాజకీయ కక్ష సాధింపులు అని అన్నారు. ఆరు గ్యారెంటీల మోసం, 420 హామీల దగా, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కుతంత్రాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ను బొంద పెట్టేదాకా నిద్రపోమని, విచారణలో ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతామని కేటీఆర్ అన్నారు. గత పదిహేనేళ్లుగా నేను నా రాష్ట్రం కోసం పని చేశాను. తెలంగాణ అభివృద్ధికోసం మా నాయకుడు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేము శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశాం. మేము ఎప్పుడూ టైం పాస్ రాజకీయాలు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదు. మా నాయకుడు కెసిఆర్ మ్యానిఫెస్టోలో చెప్పని హామీలను కూడా నెరవేర్చిన నాయకుడు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు మేము ప్రజల కోసం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా చూస్తుంటే ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారు. అందులో భాగంగానే ఈ కాలేశ్వరం డ్రామా, గొర్రెల స్కామ్ డ్రామా, ఫార్ములా ఈ కారురేస్ డ్రామా, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నాని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను నేను ఏనాడూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడలేదు. గత ఏడెనిమిది ఏళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) జరుగుతోంది. నన్ను ఏదో డ్రగ్స్ కేసుల్లోనో, హీరోయిన్లతో సంబంధాల్లోనో ఇరికించాలని చూశారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. నేను అడుగుతాను మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. గత రెండేళ్లుగా ఒక సీరియల్ లాగా లీకులు ఇస్తూ నా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్న వారు ఎవరో నేను అడుగుతానని కేటీఆర్ అన్నారు.