Raghunandan Rao: సొంత పార్టీ బీజేపీ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలపై రఘునందన్ రావు వివరణ.. ఈ సారి ఏమన్నారంటే?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుస్తానని తెలిపారు.

Raghunandan Rao
Raghunandan Rao – BJP: బీజేపీ తెలంగాణ (Telangana) ఎమ్మెల్యే రఘునందన్ రావు తమ పార్టీ అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీ(Delhi)లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను, కేంద్ర మంత్రి అమిత్ షాను కించపరచలేదని రఘునందన్ రావు చెప్పారు. మీడియాతో సరదాగా మాట్లాడిన విషయాలను తప్పుగా ప్రచురించారని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారని అన్నారు. తాను అనని మాటలను కూడా రాశారని తెలిపారు.
తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి నియోజకవర్గం సమస్యలపై మాట్లాడానని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. అలాగే, తన నియోజకవర్గంలో సెంట్రల్ రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరానని అన్నారు.
బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పదేళ్లుగా తాను పని చేస్తున్నానని రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిని అని చెప్పారు. పార్టీలో పదవులు ఆశించడంలో తప్పులేదని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని చెప్పారు.
నాయకత్వ మార్పు తన పరిధిలోని అంశం కాదని, అందుకే తాను దీనిపై ఏమీ మాట్లాడలేదని రఘునందన్ రావు తెలిపారు. పదవుల రేసులో తాను లేనంటే తన సేవలను పార్టీ మరో రకంగా వాడుకోవాలని అనుకుంటుందేమేనని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని తెలిపారు.
బీజేపీలో పదవులు ఇవ్వకపోయినా తాను సాధారణ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పనిచేస్తానని రఘునందన్ రావు చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుస్తానని తెలిపారు. రఘునందన్ రావు ముఖం చూసి, బీజేపీ గుర్తు చూసే ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు.
నాయకత్వం మార్పునకు సంబంధించి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూనిఫాం సివిల్ కోడ్ పై ఆయన అభిప్రాయం చెబితే బాగుంటుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అనడం సరికాదని తెలిపారు.