A Chandrasekhar : మాజీమంత్రితో రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానం, జహీరాబాద్ నుంచి పోటీ?
బీజేపీకి రాజీనామా చేశారు మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. A Chandrasekhar - Revanth Reddy

Revanth Reddy Meets A Chandrasekhar (Photo : Twitter)
A Chandrasekhar – Revanth Reddy : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఓవైపు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలకు గాలం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ నివాసానికి వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏ.చంద్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
గత రాత్రి బీజేపీకి రాజీనామా చేశారు మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. జహీరాబాద్ నుంచి ఏ.చంద్రశేఖర్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. పార్టీలో పని చేసే వారికి తగిన ప్రోత్సాహం లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రశేఖర్ 1985-2008 మధ్య వికారాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత బీజేపీలో చేరారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీ నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మనసు మార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించడంతో చంద్రశేఖర్ మనస్తాపం చెందారని, అందుకే తీవ్ర నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
బండి సంజయ్ ను తొలగించినప్పటి నుంచి చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్నారట. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా మాట్లాడినప్పటికీ చంద్రశేఖర్ మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు.