Telangana Formation Day: పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలం.. దశాబ్దాల కల నెరవేరిన దినం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై ప్రత్యేక కథనం..

రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యమైంది.

Telangana Formation Day: పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలం.. దశాబ్దాల కల నెరవేరిన దినం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై ప్రత్యేక కథనం..

Updated On : June 1, 2025 / 11:10 PM IST

Telangana Formation Day: 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 29వ రాష్ట్రం. ఎన్నో దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది ప్రాణత్యాగాలు ఫలించి.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు అర్పిస్తే, మలి దశ ఉద్యమంలో 1200 మందికిపైగా అమరులయ్యారు.

1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం..
1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. రాజకీయ పదవుల్లో అన్యాయం జరగడం, నిధుల మళ్లింపు, ముల్కీ నిబంధలనకు విరుద్ధంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడంతో.. తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి, అది ఉద్యమానికి దారి తీసింది.

2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం
2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఓ వైపు ప్రజలకు వివరిస్తూ.. మరోవైపు తెలంగాణ కోసం రాజకీయంగానూ పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు.

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆసుపత్రికి తరలించినా దీక్షను విరమించలేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది.

శ్రీకాంతాచారి ఆత్మబలిదానం..
కేసీఆర్ దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నారు. కేసీఆర్ అరెస్ట్ కు నిరసనగా 2009 నవంబర్ 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో జరిగిన ధర్నాలో నడి రోడ్డు మీద.. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 5 రోజులు మృత్యువుతో పోరాడి.. 2009 డిసెంబర్ 3న శ్రీకాంతాచారి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అప్పటి నుంచి ఉద్యమం మరో స్థాయికి చేరుకుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

డిసెంబర్ 9న కేంద్రం కీలక ప్రకటన..
కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించింది.ఆమరణ దీక్ష 11వ రోజు 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.

సకల జనుల సమ్మె..
రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యమైంది. 2011 సెప్టెంబర్ 12న రాత్రి 12 గంటలకు సమ్మె ప్రారంభమైంది. ఇది శాంతియుతంగా 42 రోజులపాటు కొనసాగింది. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి పెంచడంతోపాటు తెలంగాణ భావజాలాన్ని పెంపొందించడానికి రాజకీయ జేఏసీ దీన్ని ప్రారంభించింది.

మిలియన్ మార్చ్..
2011 మార్చి 10… తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈరోజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో.. నిర్బంధాలను ఛేదిస్తూ జై తెలంగాణ నినాదాలతో యావత్ తెలంగాణ హుస్సేన్ సాగర తీరానికి చేరింది. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్‌పై జరిగిన తెలంగాణ మిలియన్ మార్చ్.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది.

2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం..
చివరకు 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8న లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 18న లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజిట్ ప్రచురితమైంది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నాటి నుంచి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలన..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. మరోసారి ఘన విజయం సాధించింది. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అలా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. కేసీఆర్ తన పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేశారు.

సీఎం రేవంత్ ఏడాదిన్నర పాలన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 63 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్‌ 41 స్థానాలకు పరిమితమైంది. గత డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 13 హామీలు ఇచ్చింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాల్లో ఐదు పథకాలను 100 రోజుల్లో అమల్లోకి తెచ్చింది. పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్‌ను అందించే గృహజ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని షురూ చేసింది. ఇక, జూన్ 2న తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని నూతన సంక్షేమ పథకాలును అమలు చేయనుంది.