LRS Extension: కేవలం మూడు రోజులే..! ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.

LRS Extension
LRS Extension: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఇతర లోకల్ బాడీల పర్మిషన్ పొందకుండా ఏర్పాటుచేసిన లే అవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి 25శాతం తగ్గింపుతో రెగ్యులరైజ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీతో గడువు ముగిసింది. ఈ క్రమంలో గడువు పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే, కేవలం మూడు రోజులు (మే 3వ తేదీ వరకు) మాత్రమే గడువు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)లో 20లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉన్నారు. అయితే, మార్చి నెల నుంచి అమల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ఇప్పటికే ఒకసారి పెంచారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బుధవారంతో ఆ గడువు పూర్తయింది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరో పదిహేను రోజుల నుంచి 30 రోజుల పాటు ఎల్ఆర్ఎస్ కు గడువు పెంచాలని పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ప్రభుత్వం తొలుత మే15వ తేదీ వరకు గడువు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే, కేవలం మూడు రోజులే గ్రేస్ పీరియడ్ గా పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ గడువు సరిపోదని, నెల రోజులు పెంచాలని అధికారులు కోరారు. అధికారుల సూచనల మేరకు ప్రభుత్వం ఒకటిరెండు రోజుల్లో మే చివరి నాటికి ఎల్ఆర్ఎస్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో 25శాతం రాయితీని తగ్గించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.