ధరణి పోర్టల్ ఇబ్బందులపై టీ.ప్రభుత్వం దృష్టి…నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

Telangana government focus on Dharani portal problems : ధరణి పోర్టల్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై సాంకేతిక నిపుణలతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
ఇక ఇదే అంశంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి అందింది. హైకోర్టు ఆదేశాలపై కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా? లేక న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో కేసీఆర్ చర్చిస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయడం ద్వారా ఆస్తుల వివరాలతో తదుపరి రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు కలుగకుండా ఉంటాయని భావించిన తెలంగాణ ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. ఆధార్ అటాచ్ ద్వారా ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయో అన్న దానిపై క్లారిటీ వస్తుందని సర్కార్ భావించింది. కానీ దీనికి హైకోర్టు బ్రేక్ లు వేసింది.
రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆధార్ నంబర్ నమోదు చేయకుండా.. రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆధార్ ఆప్షన్‌నే ధరణి వెబ్‌సైట్ నుంచి తీసివేయాలని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో ఆధార్ కాకుండా ఇంకా ఎలాంటి ప్రూఫ్ తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కులం ప్రస్తావన కూడా అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
హైకోర్టు ఆదేశాలను యధాతథంగా అమలు చేయాలా లేదా అన్నదానిపై సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశంలో నిపుణులతో చర్చించనున్నారు. వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. హైకోర్టు సూచించిన అంశాలకు సంబంధించిన ప్రత్యామ్నాలపైనా చర్చించనున్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు వెళ్లే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు కూడా కాదంటే అప్పుడేంటన్న దానిపైనా సీఎం అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఇవాళ జరిగే సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.