Junior Doctors: కరోనా వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్లు షాక్‌

Junior Doctors: కరోనా వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్లు షాక్‌

Telangana Junior Doctors

Updated On : May 26, 2021 / 7:38 AM IST

Junior Doctors: తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్లు షాక్‌ ఇచ్చారు. నేటి నుంచి సాధారణ వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ప్రభుత్వంపై నిరసనకు రెడీ అయ్యారు. ఇవాళ(26 మే 2021) నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా.. మిగతా వైద్య సేవలు బహిష్కరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకుంటే.. ఈనెల 28 నుంచి కోవిడ్‌ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

జనవరి 2020 నుంచి ఉపకారవేతనాలు పెంచాలని జూడాలు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీంతోపాటు విధి నిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించాలన్నది వారి మరో డిమాండ్‌. జూడాలకు బీమాతోపాటు.. కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని కోరుతున్నారు.

అలాగే, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏడాదికాలంగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తున్నా పరిష్కారం కాలేదని జూడాలు చెబుతున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో సాధారణ సేవలు బహిష్కరిస్తునట్టు స్పష్టం చేశారు.

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుండగా.. మరికొద్ది రోజుల్లోనే పరిస్ధితి అదుపులోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. 28వ తేదీ వరకు మాత్రం కోవిడ్‌ సేవలు కొనసాగిస్తామని అంటున్నారు. అంతకుముందే తమ డిమాండ్స్‌ను ప్రభుత్వం నెరవేర్చాలనీ.. లేకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు జూనియర్‌ డాక్టర్లు.