Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..?
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా..? మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్
phone tapping case
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా..? మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping case) లో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ బృందం విచారణను జెట్ స్పీడుతో ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్, ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు.. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారన్నదానిపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయంపై సిట్ బృందం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదేపదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించినట్లు సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు.
అయితే, ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డు చేసింది. ఇక రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
