Telangana Covid Updated : తెలంగాణలో కరోనా కల్లోలం.. వరుసగా రెండోరోజూ వందకుపైనే
తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం రేగింది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. వరుసగా రెండో రోజూ వందకు పైగా కొత్త కేసులు వచ్చాయి.(Telangana Covid Updated)

Telangana Covid Report
Telangana Covid Updated : తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం రేగింది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. వరుసగా రెండో రోజూ వందకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 920 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 116 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క హైదరాబాద్ లోనే అత్యధికంగా 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 43మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 907 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 89వేల 065 మంది కోలుకున్నారు. కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరిగాయి. రాష్ట్రంలో 731 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 149 కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Covid Updated)
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
కాగా.. సరిగ్గా మూడు నెలల తర్వాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్క రోజులో 100 దాటింది. ఈ ఏడాది మార్చి ఏడో తేదీన 102 కేసులు నమోదు కాగా, సరిగ్గా మూడు నెలలకు మంగళవారం(జూన్ 7) ఒక్క రోజులోనే 119 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 79 కేసులు నమోదయ్యాయి. సోమవారం(జూన్ 6) ఈ సంఖ్య 65 మాత్రమే. ఏప్రిల్ 17న 11కి చేరి, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అప్పటివరకు కనిష్ట స్థాయికి చేరుకుంది. మళ్లీ మే నెల మధ్యలో నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. ప్రస్తుత పాజిటివిటీ రేటు 0.75శాతం. గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్‌లో కేసులు గణనీయంగా పెరగడం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది.
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకునే లోపే కొత్త వేరియంట్లలో మహమ్మారి విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో కొవిడ్ ఫోర్త్ వేవ్ భయాలు నెలకొన్నాయి.
Covid-19: ఉధృతంగా కోవిడ్ వ్యాప్తి.. ఒక్క రోజులోనే 40 శాతం పెరిగిన కేసులు
కొవిడ్ కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది హైకోర్టు.
మరోవైపు దేశవ్యాప్తంగా చూసుకుంటే.. ఇవాళ ఒక్కరోజే 5వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా వేగంగా పెరుగుతూ 29 వేలకు చేరువ కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది.
Cancer drug trial: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. వైద్య చరిత్రలో తొలిసారి..
దేశంలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో రోజుకు 2 నుంచి 4 వేల లోపు కొత్త కేసులు నమోదవుతుండగా… మంగళవారం మాత్రం కొత్త కేసుల సంఖ్య ఏకంగా 5 వేలు దాటిపోయింది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తోంది.
మంగళవారం దేశవ్యాప్తంగా 3లక్షల 13వేల 361 కరోనా నిర్ధారణ పరీక్షలు జరగగా కొత్తగా 5వేల 233 మందికి పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివిటీ రేటు 1.67 శాతం మేర ఎగబాకింది. 93 రోజుల తర్వాత దేశంలో ఇలా కొత్తగా 5 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం నమోదైన కొత్త కేసుల (3,714)తో పోలిస్తే.. మంగళవారం కొత్త కేసుల్లో 41 శాతం మేర పెరుగుదల నమోదైంది.
ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళల్లోనే అత్యధిక కేసులున్నాయి. కేరళలో అత్యధికంగా 2,271 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 1,881 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 1,242 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. ఇక మృతుల విషయానికి వస్తే.. దేశంలో మంగళవారం కరోనాతో ఏడుగురు చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,715కు చేరింది.
Norovirus: నోరో వైరస్ అంటే ఏమిటి? వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
మంగళవారం కరోనా నుంచి మరో 3వేల 345 మంది కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య దేశంలో 4.26 కోట్లు దాటింది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య తగ్గిన నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28వేల 857గా నమోదైంది. క్రమంగా యాక్టివ్ కేసులు పెరుగుతున్న వైనం ఆందోళన రేకెత్తిస్తోంది.