Telangana Corona : తెలంగాణకు గుడ్ న్యూస్, కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడింది
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

Telangana Corona
Telangana Corona Second Wave : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ… ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు హెచ్చరించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కు కచ్చితంగా ధరించాలని సూచించారు. జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 1.25 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కు కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో వైద్యారోగ్య శాఖ అన్నిరకాలుగా సిద్ధమైందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు కొరత లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఏ జిల్లాలో కూడా కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని చెప్పారు.
కగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 65 వేల 607 మందికి పరీక్షలు చేయగా 465 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల 31 వేల 683కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో మరో నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3 వేల 729కి చేరింది. ఒక్కరోజులో 869 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న మొత్తం మంది సంఖ్య 6 లక్షల 17 వేల 638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 316 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గతేడాది మాదిరే ఈ ఏడు కూడా వేసవిలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈసారి సెకండ్ వేవ్ యువతపై ఎక్కువ గా ఎఫెక్ట్ చూపింది. యువత కరోనా కాటుకు బలయ్యారు. ఇక థర్డ్‌వేవ్ లో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆగస్టు నెలలో కరోనా థర్డ్ ప్రారంభం అవుతుందని, సెప్టెంబర్ నెలలో పీక్స్ కి వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.