Telangana : బిడ్డల కోసం ‘అమ్మ పరుగు’..కాళ్లకు చెప్పులు లేకుండా 5K రన్ లో విజేతగా నిలిచిన మహిళా రైతు

కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 5కె రన్‌లో పాల్గొంది అమ్మ. ఆమె ఓ రైతు కూడా. అందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. అనుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. లక్ష రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ను కూడా సొంతం చేసుకుంది.

Telangana : బిడ్డల కోసం ‘అమ్మ పరుగు’..కాళ్లకు చెప్పులు లేకుండా 5K రన్ లో విజేతగా నిలిచిన మహిళా రైతు

Mallam Rama 5k Run Winner

Updated On : June 6, 2022 / 12:59 PM IST

Mallam Rama 5k run winner  కుటుంబ పోషణ కోసం సైకిల్‌ రేస్‌లో పాల్గొనడం, సాహసాలు చేయడం లాంటివి సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలోనూ అలాంటి వాళ్లు ఉన్నారు. తన పిల్లల చదువు కోసం ఓ మహిళా రైతు.. పరుగు మొదలుపెట్టింది. ఎలాంటి అనుభవం లేకున్నా.. ప్రాక్టీస్ చేయకుండా.. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 5కె రన్‌లో పాల్గొంది. అందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. అనుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. లక్ష రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఇక్కడ కనిపిస్తున్న వారంతా టీ షర్ట్‌లు, ట్రాక్‌లు, రన్నింగ్‌ షూష్‌తో 5K రన్‌లో పాల్గొన్నారు. కానీ ఈమెకి అవేవీ లేవు. అందుకే కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెడుతోంది. అలాగని ఈమె ప్రొఫెషనల్‌ రన్నర్‌ ఏమీ కాదు. పొలం పనులు చేయడం తప్ప పరిగెత్తడంలో ఎలాంటి అనుభవం లేదు. కానీ గెలవాలన్న కసి మాత్రం అందరి కన్నా ఎక్కువే ఉంది. ఇందులో గెలిస్తే వచ్చే బహుమతితో తన పిల్లల్ని చదివించుకోవచ్చన్న కోరిక మనసులో బలంగా ఉంది. అదే తనని పరిగెత్తించింది. ఆగకుండా అందరికంటే వేగంగా విజయతీరాలకు చేర్చింది. ముందెన్నడూ పరుగు పందాల్లో పాల్గొన్న అనుభవం లేకపోయినా.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రమ విన్నర్‌గా నిలిచింది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన మల్లం రమ ఒక మహిళా రైతు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌లో 5K రన్ పెట్టారు. 30 ఏళ్లు పైబడిన మహిళలంతా ఇందులో పాల్గోవచ్చని చెప్పారు. రమకు కూడా విషయం తెలిసింది. పరుగు పందెంలో పాల్గోవాలన్న ఆసక్తి ఆమెలో కలిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి సాధన చేయలేదు. రోజూ ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు పశువులను తీసుకెళ్తూ ఉంటుంది రమ. ఇదే ఆమెకు ఓ సాధనగా మారింది. అలసిపోకుండానే 5 కిలోమీటర్లు చెంగు చెంగున జింక పిల్లలా దూకింది. ఆమె పరుగు చూసి పరుగు పందెం నిర్వాహకులే ఆశ్చర్యపోయారు. ఆమెను అభినందించి లక్ష రూపాయల చెక్కును బహుమతిగా అందించారు.

తనకు బహుమతిగా వచ్చిన లక్ష రూపాయలను తన పిల్లల చదువుకు వినియోగిస్తానంటోంది రమ. ఇక 5కే రన్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారంతా మహిళా రైతులే కావడం విశేషం. ఎంతో కఠోర సాధన చేసినా కొందరు.. పరుగు పందెంలో సత్తా చాటలేరు. అలాంటి ఓ మహిళా రైతు కాలికి కనీసం చెప్పులు లేకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తిదంటే కచ్చితంగా ఆమెను అభినందించాల్సిందే..!