పెట్రోల్ పోయించుకుంటున్నారా..తస్మాత్ జాగ్రత్త, నయా మోసం

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 06:50 AM IST
పెట్రోల్ పోయించుకుంటున్నారా..తస్మాత్ జాగ్రత్త, నయా మోసం

Updated On : September 6, 2020 / 7:55 AM IST

Petrol Bunks Seized Major Fuel Scam : పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌ అప్ డేట్ అయ్యారు. ఇన్నిరోజులు నీలి కిరోసిన్‌ కలిపి పెట్రోల్ విక్రయించిన బంకులు.. ఇప్పుడు టెక్నాలజీ వాడి వినియోగదారులను నిండా ముంచుతున్నారు. మిషన్‌లలో చిప్‌లను అమర్చి చీట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 22 బంకులను, తెలంగాణ 13 బంకులను సీజ్‌ చేశారు పోలీసులు. ఏపీ, తెలంగాణలోని పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్న ఘరానా మోసాన్ని బయటపెట్టారు పోలీసులు.



పెట్రోల్‌ పంప్‌లలో ప్రత్యేక చిప్‌లను అమర్చి.. ఎక్కువ ధరకు తక్కువ పెట్రోల్ వచ్చేలా సెట్టింగ్స్‌ మార్చారు బంక్‌ యజమానులు. వినియోగదారుడికి అసలు అనుమానం రాకుండా అతను చెల్లించిన పూర్తి డబ్బులకు పెట్రోల్ పోసినట్లు మాయ చేస్తున్నారు. ఒక లీటర్ పెట్రోల్‌కి సుమారు 30 నుంచి 40 ML ఇంధనాన్ని దోచుకుంటున్నారు.

పెట్రోల్‌ పంప్‌లో చిప్ అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై తెలంగాణ, ఏపీ పోలీసులు నిఘా పెట్టారు. సైబరాబాద్‌ పరిధిలో పెట్రోల్ బంక్‌లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. బంక్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 13 బంకులను అధికారులు సీజ్ చేశారు. లీటర్‌ పెట్రోల్‌కు 30 ఎంఎల్ చీటింగ్‌ చేస్తూ.. లక్షల్లో డబ్బు సంపాదించారని పోలీసులు తెలిపారు.




పెట్రోల్ తక్కువగా వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించేలా చిప్‌లను అమర్చారన్నారు. తెలంగాణలో నాలుగు గ్యాంగ్‌లున్నాయని.. ఈ వ్యవహరాంలో శుభం పాషా కీలక సూత్రధారని సైబరాబాద్‌ సీపీ తెలిపారు.
తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏపీలోనూ పెట్రోల్ బంక్‌లపై దాడులు నిర్వహించారు లీగల్‌ మెట్రాలజీ అధికారులు. విజయవాడ, తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, ఒంగోలు జిల్లాల్లో తనిఖీలు చేశారు.

మహారాష్ట్ర నుంచి చిప్‌లను తీసుకొచ్చి అమర్చిన బంకులను సీజ్‌ చేశారు. ఏపీ వ్యాప్తంగా 26 బంకులను సీజ్ చేసి.. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు . ఈ ప్రోగ్రామింగ్‌ చిప్‌లతో నెలకు సుమారు 6లక్షల రూపాయల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని దాడులు నిర్వహిస్తామన్నారు పోలీసులు. ఈ వ్యవహారంతో సంబంధమున్నవారందరినీ అరెస్ట్‌ చేస్తామన్నారు.