Telugu Students : హమ్మయ్య.. మణిపూర్ నుంచి క్షేమంగా చేరుకున్న 150మంది తెలుగు విద్యార్థులు
Telugu Students : 150మంది విద్యార్థులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు వచ్చారని, వారందరినీ స్వస్థలాలకు పంపడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

Telugu Students
Telugu Students : మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను తీసుకుని ఇంఫాల్ నుంచి శంషాబాద్ చేరుకుంది తొలి విమానం. ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు విద్యార్థులు ఆ విమానంలో ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. 150మంది విద్యార్థులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు వచ్చారని, వారందరినీ స్వస్థలాలకు పంపడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
ప్రత్యేక బస్సుల్లో విద్యార్థులను ఏపీ, తెలంగాణలోని వారి వారి స్వస్థలాలకు తరలిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అంతేకాదు, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మణిపూర్ నుంచి 150 మంది విద్యార్థుల్లో 75మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారున్నారు. చెకింగ్ పూర్తయ్యాక విద్యార్థులను ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపుతున్నారు.
Also Read..US Texas Firing : అమెరికాలో కాల్పులు .. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్డి కుమార్తె మృతి
మణిపూర్ రాష్ట్రం మండిపోతోంది. గడిచిన కొన్ని రోజులుగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్టీ రిజర్వేషన్ అంశం గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చిచ్చు రాజేసింది. గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హింసకు దారితీసింది. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54మంది చనిపోయారు. మణిపూర్ లో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చుందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది.
చదువు నిమిత్తం మణిపూర్ కి వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఇతర వర్గాల వారు అక్కడ చిక్కుకుపోయారు. మణిపూర్ లో చెలరేగిన హింస నేపథ్యంలో ప్రాణభయంతో వారంతా బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేవని.. ఆకలి, దాహంతో అలమటిస్తున్నామని విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ లో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు కూడా అమల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇక, ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమ సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను వెనక్కి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాలను వేడుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సాయంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి.