Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగుకు మూడంచెల భద్రత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు....

Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగుకు మూడంచెల భద్రత

Three tier security

Updated On : November 30, 2023 / 2:56 AM IST

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

నది తీరం వెంబడి డ్రోన్ సాయంతో వైమానిక నిఘా

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సమీపంలోని పోలింగ్‌ బూత్‌ల వద్ద గురువారం ఎలాంటి సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల బెదిరింపులను నిరోధించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలి జిల్లాతో అంతర్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలంలోని ప్రాణహిత నది తీరం వెంబడి డ్రోన్ సాయంతో వైమానిక నిఘాను ఏర్పాటు చేశారు.

పోస్టర్లు వేసిన గ్రామాల్లో పోలీసు నిఘా

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని సున్నితమైన పోలింగ్ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రతా పొరను ఏర్పాటు చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇవ్వడంతో పాటు పోస్టర్లు వేశారు. దీంతో సరిహద్దు గ్రామాల్లో పోలీసులు నిఘాను పెంచారు.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో కూడిన అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో ఉన్నందున జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొత్తం 317 పోలింగ్‌ కేంద్రాల్లో 17 పోలింగ్‌ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు.

దండకారణ్య ప్రాంతం నుంచి మావోయిస్టు యాక్షన్ టీం

ములుగు జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 650 మంది హోంగార్డులతో పాటు 19 కంపెనీల సీఏపీఎఫ్, 650 మంది జిల్లా పోలీసు సిబ్బందిని నియమించారు.తెలంగాణలో ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతం నుంచి ములుగు జిల్లాలోకి మావోయిస్టుల యాక్షన్ టీమ్ వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా పోలీసులు వాజీడు, వెంకటాపురం తదితర సరిహద్దు మండలాల్లో నిఘాను ముమ్మరం చేశారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప వద్ద మంగళవారం సాయంత్రం మావోయిస్టులు ఓ ట్రక్కును దహనం చేసిన నేపథ్యంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగా పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రామగుండం, మహబూబాబాద్, ఆదిలాబాద్, రామగుండం, నిర్మల్, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోని 614 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

ALSO READ : Divorced couple : విడాకులు తీసుకున్న దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు…ఎందుకంటే…

మావోయిస్టు ప్రాబల్యమున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. 23వేల అసోం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్, బీఎస్ఎఫ్ , సీఐఎస్ఎఫ్ బలగాలను తెలంగాణకు రప్పించారు. 12 వేల మంది కేంద్ర బలగాలను మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నియమించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో కేంద్ర బలగాలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.